ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మరో ఘాతుకం

 

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అకృత్యాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. నరరూప రాక్షసులా తయారయ్యి ఒళ్ళు జలదరించే విధంగా బందీలను హతమారుస్తున్నారు. ఇదివరకు తమకు పట్టుబడ్డ జోర్డాన్ పైలట్ మొవాజ్ అల్ కాసాస్బేను ఒక ఇనుప బోనులో బందించి సజీవ దహనం చేసారు. మళ్ళీ ఈసారి ఏకంగా 43 మంది ఇరాకీ ప్రజలను బందీలుగా పట్టుకొని పోయి వారినందరినీ ఇనుప బోనుల్లో బందించి సజీవంగా దహనం చేశారు. వారు స్థానిక పోలీసులో లేక ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇరాకీ ప్రభుత్వంతో కలిసి పోరాడేవారో అయ్యి ఉండవచ్చని భావిస్తున్నారు. వారందరూ ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరానికి సుమారు 200 కిలోమీటర్లు వాయవ్య దిశలో అల్ బాగ్దాదీ నగరానికి చెందినవారు.

 

ఈ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై సైనిక చర్య చెప్పట్టేందుకు తన ప్రభుత్వానికి అనుమతి ఇమ్మని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు)ని కోరనున్నారు. అందుకోసం ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ప్రతిపక్ష నేతలతో మంతనాలు చేస్తోంది. వారు అందుకు అంగీకరించినట్లయితే, త్వరలోనే అమెరికా సేనలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పెద్ద ఎత్తున దాడులు చేసి వారిని తుదముట్టించే అవకాశం ఉంది. కానీ అంతవరకు ఉగ్రవాదుల చేతుల్లో ఇంకా ఎంతమంది అమాయకులయిన ప్రజలు ఈవిధంగా ప్రాణాలు కోల్పోతారో ఎవరికీ తెలియదు.