జలం కోసం జగన్‌తో జగడమేనా? చెల్లికి అంత సీనుందా?

చెల్లమ్మ పార్టీ పెడితే అన్నయ్యకు సంబరముండాలి. కానీ, షర్మిలమ్మ పార్టీ పెట్టక ముందే జగనన్నకు వార్నింగ్‌లు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏమాత్రం వెనకాడనంటూ హెచ్చరిస్తోంది. "మాట మీద నిలబడే వైఎస్ఆర్ బిడ్డగా చెప్తున్నా.. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, ఏ పనినైనా అడ్డుకుంటా" అంటూ ఖమ్మం సభ సాక్షిగా ఇటు ఏపీకి, అటు జగన్‌కు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది వైఎస్ షర్మిల. 

అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్‌తో సఖ్యతగా మెదిలారు జగన్. ఏళ్లుగా నడుస్తున్న జల జగడాలకు ముగింపు పలకాలని భావించారు. మంత్రులు, అధికారులు తదతర మందీమార్బలంతో ప్రగతిభవన్ వెళ్లి మరీ, మీటింగుల మీద మీటింగులు పెట్టుకున్నారు. తీరా తుదకు వచ్చేసరికి అంతా తుస్సుమంది. జల జగడం మళ్లీ మొదటికొచ్చింది. కేసీఆర్‌తో జగన్‌కు నీళ్ల పంచాయితీ మళ్లీ మొదలైంది. 

కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కడుతోంది తెలంగాణ. రోజుకు 2 టీఎంసీలు లిఫ్ట్ చేయడం ఆ ప్రాజెక్ట్ లక్ష్యం. అటు, ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ పదే పదే అడ్డుపుల్ల వేస్తోంది. పోతిరెడ్డిపాడు వివాదంతో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. కృష్ణా జలాల కోసం ఇరు రాష్ట్రాల మధ్య వార్‌ మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ తీసుకున్న నిర్ణయం కాంట్రవర్సీకి కారణమైంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ సర్కార్‌ మండిపడుతోంది. అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టులు ఎలా కడతారని  కేసీఆర్ ఫైర్‌ అయ్యారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజుకుంది.

తెలంగాణ సర్కార్‌ ఆరోపణలపై ఏపీ సీఎం జగన్ కూడా సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. తమకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు తమ భూభాగంలో ప్రాజెక్టు కట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఏపీకి కేటాయించిన నీటిని తీసుకోవడానికే పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటున్నామన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి నీళ్లులేని పరిస్థితి ఉందన్నారు. దీనిపై మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని కేసీఆర్‌ను కోరారు జగన్.

ఇలా ఏపీ, తెలంగాణ మధ్య వాటర్ వార్ జరుగుతున్ననేపథ్యంలో.. త్వరలోనే కొత్త పార్టీతో రాజకీయాల్లోకి రానున్న షర్మిల.. మొదట్లోనే నీటి మంటను రాజేవారు. అన్న ప్రాసనలోనే ఆవకాయ పచ్చడి అన్నట్టు.. తొలి సభలోనే జల జగడాన్ని మరింత రాజేశారు. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, ఏ పనినైనా అడ్డుకుంటానంటూ పరోక్షంగా ఏపీకి, జగన్‌కి వార్నింగ్ ఇచ్చారు. జగన్‌నే ఎదిరించే ధైర్యమా చెల్లెలికి? ఏపీ నోటి కాడి నీటిని అడ్డుకునే సాహసమా షర్మిలకి? ఏపీకి చెందిన వైఎస్సార్ కూతురికి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరికి.. ఆంధ్రప్రదేశ్‌పై ఎందుకంత ధ్వేషం? తెలంగాణ రాజకీయాల్లో రాణించాలంటే ఆంధ్రకు అన్యాయం చేయడానికి సిద్ధమవ్వాలా? ఏ కృష్ణా జలాల కోసమైతే కేసీఆర్‌తో జగన్ పోరాడాలని అనుకుంటున్నారో.. అవే కృష్ణా వాటర్‌ను ఏపీకి దక్కకుండా అడ్డుకోవడానికి అన్నతో చెల్లి ఫైటింగ్ చేస్తుందా? షర్మిలకు అంత సీన్ ఉందా? జగన్‌తో తలపడేంత ధైర్యం ఉందా? అంత సాహసానికి తెగిస్తుందా? రాఖీ కట్టిన అన్నయ్యను రచ్చ కీడుస్తుందా? చెల్లే కదాని జగనన్న తగ్గుతారా? తగ్గేదేలే అంటూ తుదకంటూ పోరాడుతారా? లేక, ఇదంతా అన్నాచెల్లెల్లు కలిసి ఆడుతున్న రాజకీయ డ్రామానా?