జనసేనను బీజేపీలో విలీనం చేస్తారేమో? పవన్ కు మంత్రుల కౌంటర్

 

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి జగనే టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను జగన్మోహన్ రెడ్డి అంటూ పిలవనని... జగన్ రెడ్డి మాత్రమే అంటానన్న పవన్... ఇఫ్పుడు జగన్ ను అస్సలు ముఖ్యమంత్రిగానే గుర్తించడం లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు, తాను ప్రత్యేక హోదా ఇష్యూను పక్కనబెట్టి మోడీ-షాతో చేతులు కలిపి ఉంటే అస్సలు వైసీపీ గెలిచేదా అంటూ వ్యాఖ్యానించారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పటి రాజకీయాలకు మోడీ, అమిత్ షా లాంటి వాళ్లే కరెక్ట్ అన్నారు. మోడీ-షాలు ఏదైనా అనుకుంటే ఉక్కుపాదంతో తొక్కినట్లు వ్యహరిస్తారని అన్నారు. ప్రస్తుత రాజకీయాలు దారుణంగా మారాయన్న పవన్... ఇప్పటి నేతలకు మోడీ-షాలే కరెక్ట్ అంటూ వ్యాఖ్యానించారు.

ఇక, తన కులం... మాట తప్పని కులమంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపైనా జనసేనాని మండిపడ్డారు. మీది మాట తప్పని కులమైతే... మిగతా కులాలు మాట తప్పుతాయనా మీ ఉద్దేశం అంటూ ప్రశ్నించారు. ఇక, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల భాషపైనా పవన్ నిప్పులు చెరిగారు. మంత్రులు, ఎమ్మెల్చేలు పిచ్చి కూతలు కూస్తుంటే జగన్ ఏం చేస్తున్నారని నిలదీశారు. అధికారంలోకి వచ్చి ఆర్నెళ్లవుతున్నా కనీసం ఉల్లి ధరను కూడా నియంత్రించలేకపోయారని ఎద్దేవా చేశారు. తాను ఎవరికీ భయపడనన్న పవన్ కల్యాణ్... తాను నిజాలు మాట్లాడుతున్నాను కాబట్టే.... అధికార పార్టీ వణికిపోతోందని అన్నారు.

అయితే, పవన్ విమర్శలకు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. జనసేనను బీజేపీలో కలిసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని, అందుకే మోడీ-అమిత్ షాను పొగుడుతున్నాడని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని అన్నారు. జనసేనను విలీనం చేయాలంటూ అమిత్ షా అడిగారని గతంలో పవనే స్వయంగా చెప్పారని, ఇప్పుడు అది నిజం కాబోతుందేమోనన్నారు. ఇక, పవన్ గుర్తించకపోయినా పర్వాలేదని... జగన్మోహన్ రెడ్డిని, తమను ప్రజలు గుర్తించారని... తమకది చాలన్నారు. స్త్రీ అంటే విలువ లేకుండా నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్ కూడా మహిళోద్ధరణపై మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందంటూ కౌంటరిచ్చారు మంత్రులు.