తలనొప్పిగా మారిన వైసీపీ ఎమ్మెల్యేల తీరు.. అనంతలో నీటి గొడవలు!!

 

అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలని అధిగమించాలన్నా.. అక్కడి సమస్యల్ని పరిష్కరించాలన్నా అదంత సులభం కాదని అందరికి తెలిసిన విషయమే. ఈ సంగతి వైసిపి అధిష్టానానికి చాలా కొద్దిరోజులోనే అర్థమైంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా అభివృద్ధి మీద మూడు రివ్యూ లు జరిగాయి. అందులో ఒకటి జిల్లా మంత్రి శంకర నారాయణ ఆధ్వర్యంలో, మరొకటి పాత ఇంచార్జి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆధ్వర్యం లో, మూడవది ప్రస్తుత ఇన్ చార్జి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి.ఇలా ముచ్చటగా మూడు మీటింగ్ లు జరిగితే మూడు మీటింగ్లలోనూ సేమ్ సీన్. ఎమ్మెల్యేలంతా ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా వ్యవహరించారు. అంతకుముందు జరిగిన సాగు నీటి సలహా మండలి సమావేశంలో కూడా అంతే జరిగింది. నీటి విషయంలో ఏ ఎమ్మెల్యే కూడా తగ్గడం లేదు. 

అనంతపురం జిల్లాకు ఉన్న నీటి వనరుల్లో ప్రధానమైనవి రెండు. ఒకటి తుంగభద్ర ఎగువ కాలువ అయిన హెచ్చెల్సీ, రెండోది శ్రీశైలం బ్యాక్ వాటర్ మీదుగా ఏర్పడిన హంద్రి నీవా ప్రాజెక్టు. ఈ రెండే జిల్లాకు ప్రధానమైన ఆధారం. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు నీరు కావాలని డిమాండ్ పెట్టడంతో మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవలే కొత్త ఇన్ చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం వచ్చి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు. తమ నియోజకవర్గానికి నీళ్లు కావాలంటే తమ నియోజకవర్గానికి కావాలంటూ మైకందుకుని అందరూ ఉపన్యాసాల మీద ఉపన్యాసాలిచ్చారు. మెజార్టీ ఎమ్మెల్యేలు వైసిపి నేతలే ఉండటంతో నేతల మధ్య పరస్పర సమన్వయం లేదని సమాచారం.దీంతో ఇన్ చార్జి మంత్రికి ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోడంతో మంత్రి కొంత అసహనానికి గురయ్యారు. మొత్తం మీద అనంతపురం ఎమ్మెల్యేల తీరు పై వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.