వంశీ వర్సెస్ విజయనిర్మల.. విశాఖ తూర్పులో వైసీపీ కార్యకర్తల చీలికలు

విశాఖ తూర్పు నియోజక వర్గాల్లో వైసీపీ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ నియోజక వర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పరిగణిస్తారు. వరుసగా 3 సార్లు టిడిపి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు అక్కడ విజయం సాధించారు. ఆయనకి ప్రత్యర్థి ఎవరని అడిగితే వంశీకృష్ణ శ్రీనివాస్ అని టక్కున సమాధానం వినిపిస్తుంది. వంశీకృష్ణ శ్రీనివాస్ మొదట్లో ప్రజారాజ్యంలో ఉన్నారు. ఒక్కసారి ఆ పార్టీ పక్షాన పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ తరపున పోటీ చేసి కూడా ఓటమి పాలయ్యారు. తర్వాతి కాలంలో ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్ లు వచ్చినా జగన్ కి ఇచ్చిన మాటకు కట్టుబడి వైసిపి లోనే ఉండిపోయారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టానం వంశీకృష్ణ శ్రీనివాస్ కి షాకిచ్చింది. ఆయనకు కాదని  విజయనిర్మలకు టికెట్ కేటాయించింది వైసీపీ. దీంతో స్థానిక వైసీపీ కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొని హడావుడి చేశారు. చివరకు జగన్ ఇచ్చిన హామీతో ఆ చిటపటలు సద్దుమణిగాయి. 

మొన్నటి ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజక వర్గంలో విజయనిర్మలకు టికెట్ కేటాయించినప్పటికీ వంశీలాగానే ఓడిపోయారు. తొలుత విజయనిర్మల భీమిలి నియోజక వర్గ వైసీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. భీమిలి సీటుని అవంతికి కేటాయించడంతో ఆమెను తూర్పు నియోజకవర్గానికి తీసుకువచ్చారు.ఆర్ధికంగా ఆమె బలంగా వుండటం, యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం వంటి అంశాలు కలిసి వస్తాయని వైసిపి అధిష్టానం అంచనావేసుకుంది. వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. అయితే విశాఖ తూర్పులో అప్పటికే వెలగపూడి గెలుస్తారంటూ సర్వే రిపోర్టులు వచ్చాయి. ఇదే సమయంలో ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలంటే ఆర్థికంగా బలమైన అభ్యర్థి అయ్యి ఉండాలని వైసిపి పెద్దల భావించారు. దీంతో విజయనిర్మలను రంగంలోకి దింపారు. అయినా ఓటమి పాలయ్యారు. ఇక వంశీకృష్ణ శ్రీనివాస్ కి మేయర్ లేదా ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ హైకమాండ్ బుజ్జగించింది. మరోపక్క వంశీకృష్ణకు వైసిపి నగర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ప్రస్తుతం విజయనిర్మల తూర్పు నియోజక వర్గ వైసీపీ ఇన్ చార్జ్ హోదాలో కొనసాగుతున్నారు. వంశీకృష్ణ వర్గీయులు పూర్తిస్థాయిలో సహకరించకపోవటం వల్లే ఓడిపోయినట్టు విజయనిర్మలతో పాటు ఆమె భర్త గట్టిగా భావిస్తున్నారు. ఈ తరుణంలో వీరి మధ్య కోల్డ్ వార్ మొదలయిందంటున్నారు. 

ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో పట్టు కోసం విజయనిర్మల భర్త తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. వంశీ పేరు రాకుండా ఇక వైసీపీ తూర్పు అంటే ఆమెనే గుర్తుకు రావాలనేలా ప్లాన్లు వేస్తున్నారు. తమకంటూ సొంత వర్గాన్ని తయారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారనీ జనాలంటున్నారు. వార్డు అధ్యక్షులు పార్టీ కమిటీల్లో తాము చెప్పిన వారికే అవకాశం ఇవ్వాలంటూ ఖచ్చితంగా చెబుతున్నారు. నియోజకవర్గాలలో తమకు తెలియకుండా ఏ పనులు చేయవద్దని ఎవరికి ఏం కావాలన్నా తమ వద్దకే రావాలంటూ పెత్తనం చలాయిస్తున్నారని అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వంశీకృష్ణ శ్రీనివాస్ వెనుక నడవాలో లేక విజయనిర్మల వెనుక నడవాలో తెలియక పార్టీ కేడర్ గందరగోళపడుతోంది. పార్టీలో పదవుల విషయంలోనూ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా సొంత జాబితా తయారు చేసుకుంటున్నారు. మంత్రి అవంతి అండదండలు కూడా విజయ నిర్మలకే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయిన మాట వాస్తవమేనని అంటున్నారు.