టీఆర్ఎస్ లో పాలేరు పంచాయతీ... తేల్చుకునేందుకు సిద్ధమైన తుమ్మల

 

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటివరకు ఏలినవాళ్లు ఎందుకూ పనికి రాకూండా పోవచ్చు. ఖమ్మం జిల్లాలో ఇప్పుడదే జరుగుతోంది. కేసీఆర్ పిలుపు మేరకు 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చేరి మొన్నటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పిన తుమ్మల నాగేశ్వర్రావు పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. 2014 తర్వాత టీఆర్ఎస్ లో చేర్చుకోవడమే కాకుండా, అప్పటికప్పుడు ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.... ఆ తర్వాత పాలేరు ఉపఎన్నికలో ఎమ్మెల్యేగానూ గెలిపించుకున్నారు. అలాగే, తుమ్మలకు కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఖమ్మంలో ఆయన చెప్పిందే వేదంగా సాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ పని జరగాలన్నా తుమ్మల ద్వారానే అయ్యేది. 

అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మారింది. తెలంగాణ అంతటా క్లీన్ స్వీప్ చేసిన టీఆర్ఎస్ ... ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం చతికిలపడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. చివరికి మంత్రి తుమ్మల సైతం ఓటమిపాలయ్యారు. అయితే, మంత్రిగా తుమ్మలకు అధిక స్వేచ్ఛనిచ్చినా... తాను ఓడిపోవడమే కాకుండా... జిల్లాలోనూ పార్టీని బలోపేతం చేయలేకపోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. మరోవైపు, తుమ్మలపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో అసలు కథ మొదలైంది. మొన్నటివరకు ఖమ్మం జిల్లాలో తాను చెప్పిందే వేదంగా సాగిన తుమ్మలకు ప్రాధాన్యతకు తగ్గుతూ వచ్చింది. మరోవైపు, టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి... దూకుడుగా ముందుకెళ్తుండటంతో... తుమ్మల వర్గం ఉనికే ప్రమాదంలో పడింది. కందాల కూడా తుమ్మల టార్గెట్ గా పాలేరులో తన వర్గీయులకే పార్టీ పదవులు దక్కేలా ముందుకుసాగుతున్నారు. 

అయితే, ఓటమిభారంతో కొన్ని రోజులుగా సైలెన్స్ మెయింటైన్ చేసిన తుమ్మల మళ్లీ యాక్టివ్ కావడంతో పాలేరు టీఆర్ఎస్ లో ఇరువర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తీరుపై తుమ్మల వర్గం ఆగ్రహంతో ఊగిపోతోంది. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక, తుమ్మల కూడా ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారట. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, తుమ్మలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కూడా కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారట. దాంతో, పాలేరు టీఆర్ఎస్ లో ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ పార్టీలో నెలకొంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణ ఫలితాలను మూటగట్టుకున్న టీఆర్ఎస్.... గ్రూపు రాజకీయాలతో మరింత నష్టం జరుగుతుందని అధిష్టానం భయపడుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వర్గపోరు, విభేదాల కారణంగానే ఖమ్మం జిల్లాలో పార్టీ నష్టపోయిందని స్వయంగా కేసీఆరే ప్రకటించిన నేపథ్యంలో.... మరి తుమ్మల-ఉపేందర్ రెడ్డి పంచాయతీని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.