అర్వింద్ - యెండల మధ్య కోల్డ్ వార్... ఇందూరు దళపతి ఎంపికపై తలో మాట...

 

నిజామాబాద్ బీజేపీలో ఎంపీ ధర్మపురి అర్వింద్... మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా బీజేపీ పగ్గాలు తమ అనుచరులకే దక్కాలని ఇరువురూ ప్రయత్నాలు చేస్తున్నారు. బస్వా లక్ష్మీనర్సయ్యకు జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వాలంటూ ఎంపీ అర్వింద్ లాబీయింగ్ చేస్తుంటే.... యెండల లక్ష్మినారాయణ మాత్రం దళితుడైన ప్రకాష్ కి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి పోటీచేసి ఓడిపోయిన ప్రకాష్ కు జిల్లా బీజేపీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ బలపడుతుందని యెండల అంటున్నారు.

అయితే, అర్వింద్, యెండల ప్రతిపాదిస్తున్న వాళ్లను పక్కనబెడితే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బస్వ లక్ష్మీనర్సయ్య... నిజామాబాద్ బీజేపీ అధ్యక్ష రేసులో ముందున్నారు. అలాగే, అర్బన్ బీజేపీ ఇన్ ఛార్జ్ ధన్ పాల్ సూర్యనారాయణ సైతం పోటీపడుతున్నారు. అయితే, గతంలో టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యాలయంపై దాడి చేయడం ధన్ పాల్ కు మైనస్ గా మారింది. అలాగే, మహిళా నేత గీతారెడ్డి... అదేవిధంగా బాల్కొండ ఇన్ ఛార్జ్ రుయ్యాడి రాజేశ్వర్ సైతం జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 

అయితే, తన మనిషికే జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ పట్టుబడుతుంటే... కాదుకాదు ఎస్సీకి ఈసారి అవకాశమిద్దామని యెండల అంటున్నారు. మరోవైపు, ఒక్కసారైనా మహిళకు ఛాన్సివ్వాలని మరో వర్గం స్వరం పెంచుతోంది. దాంతో, ఇందూరు కమల దళపతి ఎవరు అవుతారన్నది ఉత్కంఠగా మారింది. నేతల పట్టింపులతో జిల్లా పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై అధిష్టానం కూడా మల్లగుల్లాలు పడుతోంది. అయితే, ఏకాభిప్రాయంతో ఎంపిక చేయాల్సిన పదవిపై ఇలా గ్రూపు రాజకీయాలు చేయడం పార్టీకి మంచిది కాదని కార్యకర్తలు అంటున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్య విజయాలు సాధించిన బీజేపీ, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆచితూచి అడుగులేస్తోంది. అందులో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టింది. అందుకే, పార్టీ సిద్ధాంతాలపై అవగాహన, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంచేసే నేత కోసం అధిష్టానం అన్వేషిస్తోంది. మరి, ఇందూరు కమల దళపతి ఎంపికలో ఎవరి మాట నెగ్గుతుందో... ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.