ఆ మంత్రిని ముప్పు తిప్పలు పెడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!!

మంత్రుల పర్యటన కోసం ఎమ్మెల్యేలు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విబేధాలు ఉన్నాయి. అధికార పక్షంలోనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు శాసన సభ్యులు. తమ నియోజక వర్గాల్లో మంత్రి పర్యటన వద్దంటే వద్దని మొఖం మీదే చెప్పేస్తున్నారు ఎమ్మెల్యేలు. అసలు తమ నియోజకవర్గంలోకి మంత్రి ఎంట్రీ అవసరమే లేదని కుండ బద్దలు కొడుతున్నారు. ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు ఎమ్మెల్యేలు.మంత్రిగా ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాదవుతోంది. ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాల కారణంగా జిల్లాలోని కొన్ని నియోజక వర్గాల్లో ప్రశాంత్ రెడ్డి అడుగు కూడా పెట్టలేదు. ఆర్మూర్, బోధన్ లలో మంత్రిగా ప్రశాంత్ రెడ్డి ఎంట్రీ జరగలేదు. ఒకటి రెండు సార్లు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించారు. నిజామాబాద్ అర్బన్ లో అడపా దడపా పాల్గొంటున్నారు. 

తమ గ్రూప్ బలంగా ఉండాలంటే ప్రశాంత్ రెడ్డిని పిలవక పోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. జిల్లాలోనే కాదు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాల్లో కూడా మంత్రితో కలిసి పాల్గొనడానికి ఇష్టపడటంలేదు ఎమ్మెల్యేలు. గత పది నెలల కాలంలో మంత్రి పాల్గొన్న సమావేశాల్లో ఎమ్మెల్యేలు కలిసి హాజరైన సందర్భాలను వేళ్ళమీదనే లెక్క పెట్టొచ్చు. ఒకవేళ మీటింగ్ లకు వచ్చిన హాజరయ్యేది ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే. దీంతో హాజరైన ఎమ్మెల్యేలతోనే సర్థుకుపోతున్నారు మంత్రి. ఇటీవల జిల్లా పరిషత్ కార్యక్రమంలో జరిగిన కీలకమైన పల్లె ప్రగతి కార్యక్రమానికి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే వచ్చారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు మాత్రం మంత్రితో సఖ్యంగానే ఉంటున్నారు. తక్కువ సమయంలోనే పరిస్థితిని అర్థంచేసుకొని సొంత నియోజకవర్గం బాల్కొండకే పరిమితమవుతున్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఆయనంటే గిట్టని ఎమ్మెల్యేలు మాత్రం ప్రశాంత్ రెడ్డి బాల్కొండకే మంత్రి అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ఉన్న సందర్భంలో అన్ని నియోజక వర్గాల్లో పర్యటించేవారు. వాస్తవానికి ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నలుగురు కేబినెట్ బెర్త్ ఆశించారు. ముఖ్యమంత్రి ప్రశాంత్ రెడ్డికి అవకాశమిచ్చారు. మంత్రికి ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ రావడానికి అది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో ప్రచారం నిర్వహిస్తానని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో మంత్రి ఎంట్రీకి ఎమ్మెల్యేలు అనుమతిస్తారో లేదో అనే ఆసక్తి నెలకొంది.