వైసీపీ ఎంపీ-ఎమ్మెల్యే మధ్య వర్గపోరు.. పబ్లిక్ లో ఫైట్.. ఒకరికి గాయాలు!

రాజకీయాలలో సొంత పార్టీ నేతల మధ్య వర్గపోరు అనేది తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని ఈ తరం రాజకీయ నాయకులు.. భుజాన వేసుకొని మరింత ముందుకి తీసుకెళ్తున్నారు. అప్పుడప్పుడు ప్రత్యర్థుల మీద విమర్శలు, ఎప్పుడూ సొంత పార్టీ వారితో వర్గపోరుతో.. రాజకీయ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందంటే.. ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. 

తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. చిలకలూరిలోని పురుషోత్తపట్నంలో మహాశివరాత్రి సందర్భంగా బైరా సంఘమిత్ర వారు ఏర్పాటు చేసిన ప్రభ వద్దకు ఎంపీ కృష్ణదేవరాయలు వచ్చారు. అయితే అక్కడికి వచ్చిన ఎంపీ కృష్ణదేవరాయులను విడదల ఎమ్మెల్యే రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక వ్యక్తికి తలకు గాయాలు కూడా అయ్యాయి. పోలీసులు అతి కష్టంమీద ఇరువర్గాలకు సర్ది చెప్పి.. దాదాపు గంటసేపు కష్టపడి.. ఎంపీ కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ వ్యవహారం వెనుక ఓ బలమైన కారణం ఉందని తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా మర్రి రాజశేఖర్‌ను ఎంపీ కృష్ణదేవరాయలు ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే రజినీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య దూరం పెరిగిందనే ప్రచారం సాగుతోంది.