పిల్లల తెలివితేటలు తల్లి నుంచే

 

పిల్లవాడికి పరీక్షలలో మంచి మార్కులు వస్తే వాడిదంతా నా పోలికే అని మురిసిపోతుంటారు తండ్రులు. ఎవరన్నా మేధావి కొడుకు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే ‘పండితపుత్ర పరమశుంఠః’ అని తిడుతూ ఉంటారు పెద్దలు. కానీ ఇక మీదట ఈ అభిప్రాయాలన్నీ మార్చుకోవాల్సి ఉంటుందేమో! ఎందుకంటే పిల్లవాడి తెలివితేటలు తండ్రి నుంచి కాదు, తల్లి నుంచి వస్తాయంటూ పలు పరిశోధనలు రుజువుచేస్తున్నాయి.

 

చాలా దశాబ్దాల క్రితమే పరిశోధకులు కొన్ని ఎలుకల మీద జన్యువుల ప్రభావానికి సంబంధించి ఒక ప్రయోగాన్ని చేశారు. ఇందులో భాగంగా జన్యువులను రకరకాల మార్పులకు గురిచేసినప్పుడు వాటిలో వివిధ శరీర భాగాలలో తేడాలను గమనించారు.

తల్లి ఎలుకకు సంబంధించిన జన్యువుల ప్రభావం మరీ అధికంగా ఉన్నప్పుడు సంతానంలో పెద్ద మెదడు, చిన్న శరీరాలు ఏర్పడటం గమనించారు. అదే విధంగా మగ ఎలుకకు సంబంధించిన జన్యువుల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు సంతానంలో చిన్న మెదడు భారీ శరీరాలు ఏర్పడ్డాయట.

దీంతో మెదడుకి సంబంధించిన అభివృద్ధి అంతా తల్లి నుంచి వచ్చే జన్యువుల నుంచి లభిస్తుందనీ, ఇతర అవయవాలకు సంబంధించిన వృద్ధి అంతా తండ్రి నుంచి వచ్చే జన్యువులతో ప్రభావితం అవుతుందనీ తేలిపోయింది.

 

ఇలాంటి జన్యువులను conditioned genes అంటారట. అంటే కొన్ని లక్షణాలకు చెందిన జన్యువుల తండ్రి/ తల్లి నుంచి బిడ్డకు వెళ్లినా కూడా వాటి ప్రభావం ఉండదు. మరి కొన్ని పరిశోధనల తరువాత స్త్రీల నుంచి వారి బిడ్డలకు అందే X క్రోమోజోమ్‌లోనే తెలివితేటలకు సంబంధించిన జన్యువులు ఉంటాయని తేలింది.

ఇలాంటి పరిశోధనలు అన్నింటితోనూ ఆడవారి నుంచే తెలివితేటలు వస్తాయని రుజువైంది. నిజమే! కానీ మన రోజువారీ జీవితంలో ఈ ప్రభావం కనిపిస్తుందా లేదా అనే పరిశోధనలూ జరిగాయి. ఇందుకోసం స్కాట్లాండ్‌లోని శాస్త్రవేత్తలు 14-22 సంవత్సరాలకు మధ్య ఉండే 12 వేల మందికి పైగా పిల్లలకు పరిశీలించారు. వీరి తెలివితేటల స్థాయి (IQ LEVELS) తల్లికి చాలా దగ్గరగా ఉండటాన్ని గమనించారు.

పిల్లల తెలివితేటల్లో తల్లిపాత్రని నిరూపించే మరో కోణం కూడా ఈమధ్యకాలంలో బయటపడింది. తమ పిల్లలకు దగ్గరగా ఉంటూ, వారిని శ్రద్ధగా సాకే తల్లుల వలన... పిల్లల్లో మేధోశక్తి ఎదుగుదల పరిపూర్ణంగా ఉంటుందని తేలింది. ఇలాంటి తల్లులు ఇచ్చే సహకారంతో పాటుగా వారందించే ప్రోత్సాహం, వారు తమకి అండగా ఉన్నారన్న నమ్మకం పిల్లల ఆలోచనాశక్తి వికసించేందుకు తోడ్పడిందట. ఇలాంటివారిలో మేధోవికాసం 10 శాతం అధికంగా ఉందని తేలింది.

 

ఈ పరిశోధనల గురించి విన్న మగవారు ఏమంత డీలాపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెదడు సమర్థవంతంగా పనిచేసేందుకు శరీరంలోని ఇతర వ్యవస్థలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి పరిపూర్ణమైన శరీరం తండ్రి నుంచే కదా లభించేది! పైగా పిల్లలకు పుట్టుకతో వచ్చే తెలివితేటల కేవలం 40 నుంచి 60 శాతమే! అతను పెరిగే వాతావరణం, ఆహారం, తల్లిదండ్రులు అందించే ప్రోత్సాహం, శిక్షణ వంటి సవాలక్ష కారణాల మీద అతని పూర్తిస్థాయి తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. ఇందులో తల్లి పాత్ర ఎంత ఉందో, తండ్రి పాత్ర కూడా అంతే ఉంటుంది కదా!!! కాకపోతే ఇకమీదట తమ పిల్లల తెలివితేటలన్నీ తనవల్లే వచ్చాయంటూ మురిసిపోయే అవకాశం మాత్రం లేదు.                                

 

 

    - నిర్జర.