ముసలి ఆవుని తరిమేస్తే!

Publish Date:Jan 22, 2016


అనగనగా ఒక గురువుగారు తన శిష్యునితో కలిసి హిమాలయాలలో సంచరిస్తున్నారు. ఒకరోజు వాళ్లు అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా చీకటి పడిపోయింది. ఎటు చూసినా చిమ్మచీకటి. ఈ చీకటివేళలో తలదాచుకునేందుకు చోటు దొరికితే బాగుండు దేవుడా అని వాళ్లు ప్రార్థిస్తుండగా, కాస్త దూరంలో ఒక చిన్న దీపపు వెలుగు మిణుకుమిణుకుమంటూ కనిపించింది. ఆ వెలుగుని అనుసరిస్తూ వెళ్లిన గురుశిష్యులకి ఒక చిన్న గుడిసె కనిపించింది. ఏ సమయంలోనైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ గుడిసెలోకి అడుగుపెట్టిన వాళ్లిద్దరికీ అందులో ఏ మూల చూసినా పేదరికం సాక్షాత్కరించింది. ఈ పేదరికం మధ్య బతుకుతున్న ఓ కుటుంబమూ కనిపించింది. ఒక భార్యాభర్తా, వారి ఇద్దరు పిల్లలూ చిరిగిన బట్టలతో చలికి వణుకుతూ కనిపించారు.

‘మేం దారి తప్పిపోయి ఇటువైపుకి వచ్చాం. మీరు కనుక ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తే, ఉదయాన్నే వెళ్లిపోతాము.’ అని అభ్యర్థించాడు శిష్యుడు. ‘ఓ దానిదేం భాగ్యం’ అన్నాడు గృహస్థు.

ఆ రాత్రి మాటల మధ్యలో ‘మీకు జీవనోపాధి ఎలా?’ అని అడిగారు గురువుగారు. దానికి ఇంటి పెరట్లో కట్టేసి ఉన్న ఓ ముసలి ఆవుని చూపిస్తూ ‘అదిగో ఆ ముసలి ఆవే మాకు జీవనాధారం. అది రోజూ కాసిని పాలు ఇస్తుంది. ఆ పాలు తాగి, దాంతో చేసుకున్న జున్ను తిని బతికేస్తాం. ఇంకా కాసిని పాలు, జున్ను మిగిలితే పట్నానికి పోయి ఏదన్నా కొనుక్కుంటాం’ అని బదులిచ్చాడు గృహస్థు.
మర్నాడు ఉదయం గురుశిష్యులిద్దరూ తిరుగు ప్రయాణం కట్టారు. కాస్త దూరం వెళ్లగానే గురువుగారు ‘శిష్యా! నువ్వు నాకోసం ఒక పని చేయాలి. వెళ్లి ఆ ఆవుని దూరంగా అడవుల్లోకి తరిమేసి రా’ అన్నారు.

గురువుగారి మాటలకు శిష్యుడు ఆశ్చర్యపోయాడు ‘అయ్యా ఆ కుటుంబానికి ఉన్న ఒకే ఒక్క జీవనాధారం ఆ ముసలి ఆవే కదా! దాన్ని తరిమేస్తే వాళ్లంతా ఆకలితో చచ్చిపోతారు,’ అని నసిగాడు.

‘అదంతా నాకు తెలుసు! నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పిన పని చేయి,’ అని హుంకరించారు గురువుగారు.
ఇక గురువుగారి మాట కాదనలేని శిష్యుడు దొంగచాటుగా వెళ్లి ఆ ఆవుని ఎవరికీ కనపడనంత దూరంగా అడవుల్లోకి తరిమేసి వచ్చాడు. గురువుగారి ఆజ్ఞని నెరవేర్చాడే కానీ శిష్యుడిని తను చేసిన పనికి చాలా గిలిగా ఉండేది. కొన్నాళ్లకి పశ్చాత్తాపంతో అసలు అన్నం సయించడం కూడా మానేసింది. ‘ఇక లాభం లేదు’ అనుకున్నాడు శిష్యుడు. ‘వెళ్లి నేను చేసిన పనికి వాళ్లని క్షమాపణ కోరతాను. అవసరం అయితే వాళ్లకి ఏదో ఒక విధంగా సాయపడతాను’ అనుకుంటూ ఆ పూరి గుడిసె వైపుకి బయల్దేరాడు శిష్యుడు.
అల్లంత దూరంలో ఆ గుడిసె ఉండే ప్రదేశాన్ని చూడగానే శిష్యుని కళ్లు బైర్లు కమ్మాయి. ఆ గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో చక్కటి ఇల్లు ఉంది. ముసలి ఆవు ఉండాల్సిన చోట చక్కటి గుర్రాలు ఉన్నాయి. ‘పాపం ఈ చోటుకి ఎవరికో అమ్మేసి ఆ కుటుంబం వలస వెళ్లిపోయి ఉంటుంది’ అనుకుంటూ ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టాడు శిష్యుడు. ఎదురుగా చూస్తే ఇంకెవరు ఆనాటి గృహస్థు. మనిషైతే అతనే, కానీ అతని వేషధారణే మారిపోయింది. ఖరీదైన బట్టలు, చలిని ఆపేందుకు శాలువా, మెడలో బంగారు గొలుసు. ఇంటి లోపల తిరుగుతున్న మిగతా కుటుంబసభ్యులదీ ఇదే పరిస్థితి.

‘అయ్యా రెండేళ్ల క్రితం నేను మా గురువుగారితో ఇక్కడికి వచ్చాను. గుర్తుపట్టారా!’ అని వినయంగా అడిగాడు శిష్యుడు.
‘అయ్యయ్యో గుర్తుపట్టకేం. దయచేయండి’ అంటూ సాదరంగా ఆహ్వానించాడు గృహస్థు.

ఇంట్లో ఎన్ని అతిథి మర్యాదలు జరుగుతున్నా శిష్యుని మనసులో మాత్రం రకరకాల ఆలోచనలు, సందేహాలు! వాటిని గ్రహించిన గృహస్థు ‘రెండేళ్ల క్రితం మీరు వచ్చినప్పుడు మేం కటిక పేదరికంలో ఉండేవాళ్లం. అప్పట్లో మాకున్న ఒకే ఒక జీవనాధారం ఆ ముసలి ఆవు మాత్రమే. ఒక రోజు అదీ తప్పిపోయింది. మొదట్లో మాకు ఏం చేయాలో పాలు పోలేదు. ఆవు ఉన్నంతవరకూ ఏ పనీ చేయకుండా దానిమీదే ఆధారపడేవాళ్లం. మరో విషయం గురించి ఆలోచించే అవకాశమే లేకపోయింది. కానీ అది పోయాక మా జీవనోపాధి కోసం రకరకాల ఉపాయాలని ఆలోచించడం మొదలుపెట్టాము. బట్టలు నేయడం, చెక్కపని చేయడం, అడవిలో ఉండే అరుదైన ఔషధాలను సేకరించడం… ఇలా నానారకాల పనులన్నీ చేసేవారం. అలా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని పెట్టుబడిగా దాచుకునేవాళ్లం. త్వరలోనే మా నైపుణ్యాలకి తగిన గుర్తింపు లభించింది. అదృష్టం మమ్మల్ని వరించింది. దానికి ఫలితంగానే ఈ సంపద’ అంటూ ముగించాడు గృహస్థు.

గృహస్థు మాటలు విన్న తరువాత శిష్యుడికి తన గురువుగారు చేసిన పనిలో ఆంతర్యం బోధపడింది ‘ఆ ముసలి ఆవులాగానే కొన్ని ఆధారాలు మనల్ని బలహీనురుగా మార్చేస్తాయి. వాటిని విడిపించుకున్నప్పుడే మనలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయగలం,’ అనుకుంటూ తన గురువుగారిని చేరుకునేందుకు తిరుగుముఖం పట్టాడు.

--నిర్జర

By
en-us Life Style News -