రైల్వే చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్.. కలలో కూడా ఊహించం

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన తర్వాత కొన్ని రోజులు కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడిచాయి. తరువాత వలస కార్మికుల కోసం శ్రామిక రైళ్లను ప్రభుత్వం నడుపుతోంది. మొన్న జూన్ నెల నుండి సాధారణ ప్రయాణీకుల కోసం కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా స్టార్ట్ చేసింది రైల్వే డిపార్ట్ మెంట్. మొత్తం గా 230 రైళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఐతే రైలు ప్రయాణం అంటే మనకు సినీ కవి ఆరుద్ర గారి ఒక మాట తప్పకుండా గుర్తుకొస్తుంది. అది "నేను ఎక్కవలసిన రైలు ఒక జీవిత కాలం లేటు" అని. వీటి దుంప తెగ మనం ముందుగానే రైల్వే స్టేషన్ కు చేరుకుంటే మన్మ ఎక్కవలసిన రైళ్లు మాత్రం తాపీగా గంటల కొద్దీ ఆలస్యంగా వస్తుంటాయి. ఐతే తాజాగా భారతీయ రైల్వే ఈ రోజు ఒక అద్భుతమైన రికార్డ్ నెలకొల్పింది. అదేంటంటే భారతీయ రైల్వేల చరిత్రలో తొలిసారి అన్ని రైళ్లు 100 శాతం సరైన సమయానికి గమ్యాన్ని చేరుకున్నాయి.

రైల్వే బోర్డు చైర్మన్ వైకే యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం 30 రాజధాని రైళ్లు, 200 ప్రయాణికుల రైళ్లు ఏ మాత్రం ఆలస్యంగా నడవకూడదని, నిర్ణీత సమయానికి చేరుకోవాలని అన్ని జోన్ల జనరల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లను ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సంఖ్య తక్కువే అయినా ఆలస్యం కావొద్దని అయన స్పష్టం చేశారు. దీంతో రైల్వే చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్ ఈ రోజు నమోదైంది.