పాక్ పైన జరిగిన సర్జికల్ స్ట్రైక్ లో 300 మంది ఉగ్రవాదులు చనిపోలేదా..? 

2019 ఫిబ్రవరిలో కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది మన సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ లో 300 మంది చనిపోయినట్టు పాక్ మాజీ రాయబారి అప్పట్లో చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదా..? అసలు ఆయన అలాంటి వ్యాఖ్యలే చేయలేదా? అంటే అవుననే అంటోంది ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ "ఆల్ట్ న్యూస్". ఆ వెబ్‌సైట్ తాజా కథనం ప్రకారం పాకిస్తాన్ మాజీ రాయబారి అఘా హిలాలీ చేసినట్టుగా చెబుతున్న ఆ వీడియోను మానిప్యులేట్ చేశారని పేర్కొంది.

 

మనదేశంలోని పలు దినపత్రికలతోపాటు, నేషనల్ న్యూస్ చానెళ్లు కూడా ఈ వార్తను ప్రచురించాయి. 26 ఫిబ్రవరి 2019లో భారత వాయుసేన మెరుపుదాడిలో 300 మంది ఉగ్రవాదులు మరణించినట్టు ఎట్టకేలకు పాకిస్తాన్ అంగీకరించిందంటూ పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి మరీ రాసుకొచ్చాయి. అయితే టీవీ చర్చల్లో పాల్గొనే హిలాలీ ఎప్పుడూ పాక్ ఆర్మీ వైపు వకాల్తా పుచ్చుకుని మాట్లాడతారని, బాలాకోట్‌లో భారత్ జరిపిన మెరుపుదాడిలో అసలు ఒక్కరు కూడా చనిపోలేదని ఆయన చెప్పినట్టు ఆల్ట్ న్యూస్ తాజాగా స్పష్టం చేసింది.

 

"అంతర్జాతీయ సరిహద్దు దాటి యుద్ధానికి వచ్చినట్టు వచ్చారు. వారు 300 మందిని చంపాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. మా లక్ష్యం వారి లక్ష్యానికి భిన్నమైనది. మేం వారి హై కమాండ్‌ని టార్గెట్ చేశాం. అది మా న్యాయమైన టార్గెట్. ఎందుకంటే వారు సైనికులు. సర్జికల్ స్ట్రైక్స్‌లో ఎవరూ మరణించలేదని అంతర్లీనంగా చెప్పాం. ఇప్పుడూ వాళ్లకి ఏం చెప్తున్నామంటే, వాళ్లు ఏం చేసినా, వాళ్ళు ఎంత చేస్తే, మేం కూడా అంతే చేస్తామని, అంతకన్నా ఉద్ధృతం చేయబోమని చెప్తున్నాం ’’ అని అఘా హిలాలీని చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

 

"అజెండా పాకిస్థాన్" అనే కార్యక్రమంలో హిలాలీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొంది. అయితే, ఆ వెంటనే ఆయన మాట్లాడుతూ.. ‘‘భారత ఆపరేషన్ విఫలమైంది. వారు ఓ ఫుట్‌బాల్ మైదానంలో బాంబు వేశారు. పాకిస్తాన్ వైపు నుంచి ఒక్కరు కూడా చనిపోలేదు’’ అని హిలాలీ వివరించారు. అంతేకాకుండా భారత దాడుల్లో 300 మంది చనిపోయారని తాను చెప్పినట్టు వస్తున్న వార్తలపై జఫార్ హిలాలీ స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను ఎడిట్ చేశారని అయన పేర్కొన్నారు. తన మాట్లాడిన వీడియోలో 0.7-0.9 సెకన్ల మధ్య కట్ చేశారని తెలిపారు. మర్నా (చంపాలని) అని తాను చెపితే మరా (చనిపోయారు) అని ఎడిట్ చేసారని అయన పేర్కొన్నారు.