ఉరిశిక్ష రద్దు చేసే ఆలోచనే లేదు...

 

దేశంలో ఉరిశిక్షను రద్దుచేసే ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంగా చెప్పారు. భారతీయ శిక్షాస్మృతి 1860 చట్టం ద్వారా కోర్టులు నేరస్థులకు ఉరిశిక్ష విధించే హక్కును కలిగి ఉన్నాయి. భారతీయ శిక్షాస్మృతి 1860 చట్టాన్ని సవరించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే లా కమిషన్ ఇటీవల తన వెబ్‌సైట్‌లో ఉరిశిక్షకు సంబంధించి సూచనలు, సలహాలను, అభిప్రాయాలను అందించవలసిందిగా దేశపౌరులను కోరింది. ఈ నేపథ్యంలో, కేంద్రప్రభుత్వానికి ఉరిశిక్షను రద్దు చేసే ఆలోచన ఉందా అని పార్లమెంట్‌లో మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, ఆత్మహత్యను నేరపరిధి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐపీసీ సెక్షన్ 309 ను రద్దు చేసి... ఆత్మహత్యను నేరపరిధి నుంచి తప్పించాలని లా కమిషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసింది.