వెస్టీండీస్‌తో టెస్ట్.. రికార్డు సృష్టించిన పృథ్వీ షా.!!

 

టీమిండియా అండర్19 టీమ్ మాజీ కెప్టెన్ పృథ్వీ పంకజ్ షా ఆరంభ టెస్ట్ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో ఓపెనర్ గా దిగిన పృథ్వీ షా 56బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసాడు. ఆ తరువాత సెంచరీ చేయడంలో కూడా అదే దూకుడు కొనసాగించాడు. 99బంతుల్లోనే 101 కొట్టి సెంచరీతో సత్తా చాటాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆరంగేట్రంలోనే సెంచరీ చేసిన 15వ ఆటగాడు పృథ్వీ షా కావడం విశేషం. తొలి మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (99 బంతుల్లో) చేసిన మూడో బ్యాట్స్‌మెన్ కూడా పృథ్వీనే. ఇతని కంటే ముందు శిఖర్ ధావన్(85బంతుల్లో).. ఆ తర్వాత వెస్టీండీస్ ఆటగాడు స్మిత్ (93బంతుల్లో) ఉన్నారు. ఇదిలా ఉంటే, అతి తక్కువ వయసులోనే సెంచరీ చేసిన భారత రెండో ఆటగాడు పృథ్వీ కావడం విశేషం. పృథ్వీ కంటే ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.1990లో 17సంవత్సరాలకే ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో సచిన్ సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో పృథ్వీ షా 154 బంతుల్లో 134 పరుగులు చేసి వెనుతిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 278/3 కాగా కోహ్లీ (33) , రహానే (15 ) క్రీజులో ఉన్నారు.