కాకినాడ బీచ్ లో యుద్ధ విన్యాసాలకు రంగం సిద్ధం

 

 

ఇండో అమెరికన్ త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలకు కాకినాడ సాగర తీరం వేదిక కానుంది. ఈరోజు ( నవంబర్ 18వ తేదీ ) నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాలకు సైనిక, నౌకా దళ సిబ్బంది బీచ్ లో భారీగా ఏర్పాట్లు చేశారు. బీచ్ రోడ్ లోకి వాహనాల రాకపోకలు నిషేధించారు. భారత్, అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలకు కాకినాడ బీచ్ ముస్తాబైంది. 4 రోజుల పాటు తూర్పు తీరంలో అద్భుత విన్యాసాలను ప్రదర్శించేందుకు ఇండియన్ ఆర్మీ అధికారులు కార్యాచరణ చేపట్టారు. కాకినాడ రూరల్ మండలంలోని సూర్యారావుపేట అనే గ్రామ పరిధిలో ఉన్న బీచ్ లో ఈ విన్యాసాలు నిర్వహించనున్నారు. ప్రజలు ఏయిర్ షో ను వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. జాతీయ విపత్తు వాటిల్లినప్పుడు రోడ్లు మూసుకుపోతే ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనే దానిపై సుమారు 150 మంది నావి బృందం విన్యాసాలను ప్రదర్శిస్తారు. నావి ప్రదర్శనలతో భద్రత దృష్ట్యా కాకినాడ బీచ్ రోడ్ లోకి వాహనాల రాకపోకలను నిషేధించారు. బీచ్ లోకి వచ్చే వాహనాలను పిఠాపురం వైపు నుండి దారి మళ్లించారు. భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించడంలో భాగంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ హార్బర్ పరిధిలో ఈ నెల 16 వరకు విన్యాసాలు జరిగాయి. ఇప్పుడు కాకినాడ తీరంలో విన్యాసాలు కొనసాగనున్నాయి. ఈ విన్యాసాలు భారత నావికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్, ఐఎన్ఎస్ సంధాయక్ భారత్ ఆర్మీ లోని 7 గాడ్స్ యూనిట్ పాల్గొంటున్నాయి. ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూపర్ హెర్యులస్ విమానం ఎమ్ఐ 17 రవాణా హెలికాప్టర్ లు కూడా ఇందులో పాల్గొంటున్నాయి.