ఇండియాటుడే సర్వేలో జగన్ కు షాక్... మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఓటు...

మూడు రాజధానులను అటు అమరావతి రైతులు... ఇటు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే... జగన్ ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్లింది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపర్చి శాసనసభలో మూడు రాజధానుల బిల్లును ఆమోదించింది. అన్ని ప్రాంతాల సమానా అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఎవరేమనుకున్నా తమ నిర్ణయం ఇదేనని... ప్రజలు కూడా తమ వెనుకే ఉన్నారని అంటోంది. అయితే, జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించడం లేదని, ఇండియాటుడే సర్వేలో ఇదే తేలిందంటూ చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ఇండియాటుడే నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో 67శాతం మంది వ్యతిరేకంగా ఓటేశారని అన్నారు.

మొత్తం 7840మంది తమ అభిప్రాయాన్ని చెప్పగా అందులో 67శాతం ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదంటూ తేల్చిచెప్పారు. ఇండియాటుడే ఒపీనియన్ పోల్ లో కేవలం 29శాతం మంది మాత్రమే మూడు రాజధానులకు మద్దతు ఓటేయగా... 4శాతం తటస్థ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇండియాటుడే ఒపీనియన్ పోల్ లోనే కాదు... రాష్ట్రమంతటా ఇదే అభిప్రాయం ఉందని, మెజారిటీ ప్రజలు మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇండియాటుడే సర్వేలో 67శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లే... రాష్ట్రమంతటా ఇదే అభిప్రాయముందన్నారు.