పంద్రా ఆగస్టు కు భారత్ లో కరోనా వ్యాక్సిన్.. ఐసీఎంఆర్ టార్గెట్

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ కలకలం తో కకావికలమౌతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు లక్షల మంది ఈ వైరస్ బారిన పడుతుండగా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక భారత్ లో ఐతే గత 24 గంటల్లో 21 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ను అరికట్టేందు కోసం వ్యాక్సిన్ తయారీలో 12 ప్రముఖ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వీటిలో మన దేశానికి చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కూడా ఉంది. హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలీలో ఉన్న ఈ సంస్థ ఇప్పటికే జంతువుల పై కరోనా వ్యాక్సిన్ ను పరీక్షించి ఇది సురక్షితమేననీ తేలడంతో పాటు సమర్థంగా పనిచేస్తున్నట్లు గా గుర్తించింది. భారత్ బయోటెక్ యొక్క కరోనా వ్యాక్సిన్ "కోవ్యాక్సిన్" మొదటి, రెండో దశ ట్రయిల్స్ లో భాగంగా మనుషుల పై క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు అనుమతి పొందింది.

వ్యాక్సిన్ ఎంత ఎఫెక్టివ్ గా, ఎంత సురక్షితం గా పని చేస్తుందో అనే అంశాల పై ప్రధానంగా ఈ ప్రయోగాలు జరుగుతాయి. ఐతే కరోనా వ్యాక్సిన్ తయారీలో మంచి పురోగతి సాధిస్తున్న భారత్ బయోటెక్ వచ్చే ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఐసీఎంఆర్ కూడా కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ బయోటెక్ కు సూచించింది. ఈ వ్యాక్సిన్ తో మనుషుల పై జరిగే ట్రయల్స్ కనుక విజయవంతమైతే ఇదే తొలి వ్యాక్సిన్ గా నిలిచే అవకాశం ఉంది.