భారత్ జోరు..వెస్టిండీస్ విల విల

 

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది.ప్రత్యర్థిని ఇన్నింగ్స్‌ 272 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ఆట ముగిసింది. తొలి రోజు చిచ్చర పిడుగు పృథ్వీ షా జోరు చూపించగా రెండో రోజు ఆటలో మరో యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ దూకుడు కనిపించింది. దీనికి తోడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన సూపర్‌ ఫామ్‌ను చాటుకుంటూ శతకాలు సాధించగా రవీంద్ర జడేజా టెస్టుల్లో ఇప్పటిదాకా ఊరిస్తున్న శతకాన్ని అజేయంగా పూర్తి చేశాడు. దీంతో ఒకటిన్నర రోజులోనే భారత్‌ 649 రన్స్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

తర్వాత బ్యాటింగ్‌ ఆరంభించిన విండీస్‌ 181 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌ ఆడింది. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్‌ మరోసారి తడబడింది.ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆ తర్వాత స్వల్ప విరామాల్లో కీలక వికెట్లను చేజార్చుకుంది. విండీస్‌ తొలి వికెట్‌ను అశ్విన్‌ తీయగా, ఆపై ఐదు వికెట్లను కుల్దీప్‌ యాదవ్‌ సాధించాడు. విండీస్‌ చివరి నాలుగు వికెట్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్‌ ఒక వికెట్‌ తీశాడు. దాంతో విండీస్‌ కనీసం రెండొంద పరుగుల మార్కును చేరుకుండానే ఆలౌటైంది.మ్యాచ్‌లో విండీస్‌ ఆటగాళ్లలో కీరన్‌ పావెల్‌(83) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు.

భారత్‌ తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఇటీవల అఫ్గానిస్తాన్‌ జరిగిన టెస్టు మ్యాచ్‌లో లభించిన ఇన్నింగ్స్‌ 262 పరుగుల రికార్డును టీమిండియా సవరించింది.మరొకవైపు విండీస్‌ తన క్రికెట్‌ చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయాన్ని చవిచూసింది. 2007లో ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్‌ 283 పరుగుల ఓటమి తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత ఇదే విండీస్‌కు అతిపెద్ద పరాజయం.