నెల రోజుల్లో ఇసుక కొరత పరిష్కరిస్తాం :- వైఎస్ జగన్

 

రాష్ట్రంలో ఇసుక కొరత ప్రభావం నేపథ్యంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.ఇసుక కొరత తాత్కాలిక సమస్య అన్నారు జగన్. వరదల కారణంగా 225 రీచ్ పని చేయాల్సి ఉండగా.. కేవలం 61 మాత్రమే పని చేస్తున్నాయని అందుకే ఇసుక కొరత ఏర్పడిందన్నారు. వరదల కారణంగానే ఇసుక తీయడం కష్టంగా ఉందన్నారు. నవంబర్ నెలాఖరు నాటికి సమస్య పూర్తిగా తీరుతుందన్నారు. గత ఐదేళ్లలో ఫ్రీ ఇసుక పేరుతో మాఫియా నడిపించారని ఇప్పుడు పారదర్శకంగా అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామన్నారు.

వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతుందని సీఎం వెల్లడించారు. ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వటానికి వెంటనే ప్రత్యేక స్టాక్ యార్డు కూడా ఇస్తామన్నారు సీఎం జగన్.ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోన్న నేపథ్యంలో గత 90 రోజులుగా ఊహించని రీతిలో వరద పరిస్థితుల్లో సమీక్షించడం జరిగింది. ఏ ఏ ప్రాంతాల్లో ఇసుకని తీసే అవకాశాలు ఉన్నాయనే దాని పై అధికారులు ముఖ్యంగా చర్చించారు. డిమాండ్ కు తగ్గట్టుగా ఇసుకను అందుబాటులో ఉంచలేని పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.అన్ని నదుల్లో వరద ఉధృక్తి కారణంగా ఇసుక లభించట్లేదని  సీఎం చెప్పారు. అంతేకాక ప్రాధాన్యతా రంగాలకు ఏటా ప్రత్యేకంగా ఇసుక సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్య మంత్రి పేర్కొన్నారు.