అప్పుడే 90 కి చేరిన టీఆర్ఎస్ బలం.. వంద కానుందా?

 

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకొని ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 88 నుంచి 90 కి చేరనుంది. ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు నేతలు టీఆర్ఎస్ లో చేరనున్నారు. రామగుండం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి విజయం సాధించిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి కోరుగంట చందర్‌ తాజాగా కేటీఆర్ ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు. ఎన్నికలకు ముందువరకు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ఉద్యమకాలం నుంచి కేసిఆర్‌ నాయకత్వంలో పనిచేశానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ తన మాతృసంస్థ అని.. కేసిఆర్‌ నాయకత్వంలో పనిచేస్తానని అని చందర్‌ స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించిన కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి లావుడ్యా రాములు నాయక్ కూడా త్వరలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు వెళ్లి కేటీఆర్ ని కలిసి పార్టీలో చేరికపై చర్చినట్లు సమాచారం. వీరిద్దరి చేరికతో టీఆర్ఎస్ బలం 90 కి చేరనుంది. అయితే ఈ సంఖ్య 100 కి చేరినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 66 సీట్లు గెలుచుకుంది. అయితే తరువాత మిగతా పార్టీల నుంచి ఎమ్మెల్యేల చేరికతో బలం 90 దాటింది. ఈసారి టీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకుంది. ఇద్దరి చేరికతోనే బలం 90 కి చేరనుంది. ఈ ఇద్దరే కాకుండా మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ లో చేరికలు ఉండే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10 స్థానాలను గాను టీఆర్ఎస్ ఒక్క కొత్తగూడెంలో మాత్రమే విజయం సాధించింది. అనంతరం మిగతా పార్టీల నేతల చేరికతో టీఆర్ఎస్ బలం పెరిగింది. ఈసారి కూడా టీఆర్ఎస్ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. కేవలం ఖమ్మం నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. అయితే గతంలో లాగానే ఇప్పుడు టీఆర్ఎస్ కు వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఆయన బాటలోనే మరికొందరు కూడా క్యూ కట్టే అవకాశముంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.