కేసీఆర్ వార్నింగ్ తో కార్మికుల్లో అలజడి... స్ట్రాంగ్ కౌంటర్ కు జేఏసీ ఎమర్జెన్సీ మీటింగ్

 

లాస్ట్ ఛాన్స్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరికలతో ఆర్టీసీ కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం... మరోవైపు యూనియన్ల మధ్య నలిగిపోతున్న కార్మికులు... ఏంచేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. ఆర్టీసీ కార్మికులు అన్-కండీషనల్ గా విధుల్లోకి చేరాలని, లేదంటే ఆర్టీసీని వంద శాతం ప్రైవేటీకరిస్తామంటూ కేసీఆర్ హెచ్చరించడంతో కార్మికుల్లో అలజడి అంతర్మధనం మొదలైంది. ఇప్పటికే పలు డిపోల్లో ఆర్టీసీ కార్మికులు రిపోర్ట్ చేస్తూ డ్యూటీలో జాయిన్ అవుతున్నారు. ఒకవైపు డిమాండ్లు సాధించుకోవాలన్నా పట్టుదల ఉన్నా... మరోవైపు రెండు నెలలుగా జీతాల్లేకపోవడం... ఇంకోవైపు కేసీఆర్ హెచ్చరికలతో... కార్మికుల్లో ఆత్మస్థైర్యం సన్నిగిల్లుతోంది. వివిధ కారణాలతో ఇప్పటికే 20మందికి పైగా కార్మికులు మరణించడంతో.... ఇక చేసేదేమీలేక కొందరు విధులకు హాజరుకావాలని నిర్ణయించుకుంటున్నారు.

ఆర్టీసీ కార్మికులు భేషరతుగా విధుల్లోకి చేరాలని, లేదంటే ఆర్టీసీని వంద శాతం ప్రైవేటీకరిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరికలతో ఆర్టీసీ కార్మిక జేఏసీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి అన్ని డిపోల జేఏసీ నేతలు హాజరుకానున్నారు. కార్మికుల అభిప్రాయాలను తీసుకోవడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ముఖ్యంగా కార్మికులకు భరోసా కల్పించడంతోపాటు ఆత్మస్థైర్యం నింపనున్నారు. అదే సమయంలో కేసీఆర్ హెచ్చరికలకు స్ట్రాంగ్ గా కౌంటర్ రియాక్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.