హంగ్ వస్తే ఎంఐఎం, బీజేపీ అడుగులు ఎటువైపు?

 

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు రేపు తెరపడనుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు టీఆర్ఎస్ మరోసారి గెలిచి అధికారం నిలబెట్టుకోనుందా? లేక లగడపాటి చెప్పినట్టు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజకూటమి గెలిచి అధికారంలోకి రానుందా? అని రేపు తేలిపోనుంది. టీఆర్ఎస్, ప్రజకూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ పోరులో ఎవరో ఒకరు గెలిస్తే ఓకే. కానీ ఒకవేళ హంగ్ వస్తే పరిస్థితి ఏంటి?. ఇప్పుడు ఇది అందరిని వేధిస్తున్న ప్రశ్న. టీఆర్ఎస్, ప్రజకూటమి రెండూ అధికారానికి కొద్ది సీట్లు దూరంలో ఆగిపోతే.. ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్లు కీలకం అవుతారు. ఇప్పటికే ఎంఐఎం తాము పోటీ చేయని స్థానాల్లో తమ మద్దతు టీఆర్ఎస్ కే అని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఒకవేళ హంగ్ వస్తే ఎంఐఎం టీఆర్ఎస్ కు మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే ప్రజకూటమికి మద్దతిచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే స్టేట్ అయినా, సెంట్రల్ అయినా బీజేపీకి ఎప్పుడూ కాంగ్రెస్ బద్ధ శత్రువే. అందుకే హంగ్ వస్తే బీజేపీ, టీఆర్ఎస్ కు మద్దతిచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఒకవేళ హంగ్ వస్తే కాంగ్రెస్ కి అధికారం దూరం చేయడం కోసం టీఆర్ఎస్ కి మద్దతిస్తామని అంటున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు గుర్తుండే ఉంటాయి. అక్కడ బీజేపీని అధికారానికి దూరం చేయడం కోసం.. కాంగ్రెస్ తక్కువ సీట్లు గెలుచుకున్న జేడీఎస్ కి మద్దతిచ్చి కుమారస్వామిని సీఎం చేసి బీజేపీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో హంగ్ వస్తే బీజేపీ కూడా కాంగ్రెస్ కి అలాంటి షాకే ఇవ్వాలనుకుంటుందట. గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు కాస్త ఎక్కువ సీట్లు గెలుస్తామని బీజేపీ భావిస్తోంది. అనుకున్నట్టే 5 నుంచి 10 సీట్లు గెలిస్తే బీజేపీ కీలకం అవుతుంది. అప్పుడు టీఆర్ఎస్ కి మద్దతిస్తే కాంగ్రెస్ కి ఆటోమేటిక్ గా షాక్ తగులుతుంది. అయితే ఇక్కడ ఓ పెద్ద మెలిక ఉంది. ఎంఐఎం మద్దతు టీఆర్ఎస్ కి ఉంటే బీజేపీ టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వలేదు. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్ ఎంత వ్యతిరేకమో, ఎంఐఎం అంతే వ్యతిరేకం. దీంతో బీజేపీ కాంగ్రెసేతర, మజ్లిసేతర ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశముంది. ఇక తప్పని పరిస్థితుల్లో ఒకవేళ టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ విడిపోయే పరిస్థితి లేకపోతే మాత్రం.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ బయటనుంచి మద్దతిచ్చే అవకాశముంది. కానీ బీజేపీ అంత సాహసం చేస్తుందో లేదో చూడాలి.

ఒకవేళ హంగ్ వచ్చి ఇంత జరుగుతుంటే.. మరి కాంగ్రెస్ ఊరుకుంటుందా?. తన మార్క్ రాజకీయం మొదలుపెట్టదు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబెల్స్ గా బరిలోకి దిగారు. వారిలో కొందరు గెలిచే అవకాశముంది. ఆ గెలిచే అవకాశమున్న రెబెల్స్ తో ఇప్పటికే కాంగ్రెస్ టచ్ లో ఉండుంటుంది. అసలే తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి అలాంటి ఎన్నికల్లో హంగ్ వచ్చి అధికారం దూరం అవుతుంటే కాంగ్రెస్ ఊరుకుంటుందా? ఎంత దూరమైనా వెళ్తుంది. అవసరమైతే కాంగ్రెస్ ఎంఐఎం తో ఉన్న పాత పరిచయాలను తెరమీదకు తెచ్చి మద్దతు కోరే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవిధంగా ఇది ఫలించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎంఐఎం కి బీజేపీ బద్ధ శత్రువు. అలాంటి బీజేపీ టీఆర్ఎస్ కి మద్దతిస్తే ఎంఐఎం కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వారు ఎన్నికలకు ముందు అలాంటి హింట్ కూడా ఇచ్చారు. మరి తెలంగాణలో హంగ్ వస్తే ఎంఐఎం, బీజేపీ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.