ప్రధానిని మనమే నిర్ణయిస్తాం.. ప్రత్యేకహోదా సాధిస్తాం

 

రాష్ట్ర ప్రయోజనాల కోసం 2014 లో బీజేపీతో కలిసి పనిచేసిన చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించట్లేదని బీజేపీని విభేదించి ఎన్డీయే నుండి బయటికొచ్చారు.. అయినా దైర్యం కోల్పోని బాబు, రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నారు.. రీసెంట్ గా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతో సమావేశమైన బాబు.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు, అలానే కేంద్ర ప్రభుత్వం తీరుని ఎండగట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రంలో లెక్కలేనన్ని సమస్యలు చుట్టుముట్టాయని తెలిపారు.. ‘రాజధాని లేదు.. ఆదాయం లేదు.. పేదవాళ్లకు రేషన్‌, వృద్ధులకు పింఛను రాదని భయపడ్డారు. ఈ కష్టాలన్నిటినీ ఓర్చుకుంటూ ధైర్యంతో నిలబడ్డాం.. నాలుగేళ్లలో కేంద్రం సహకరించలేదు.. విశాఖ రైల్వేజోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌ స్థాపనలో మొండిచెయ్యి చూపారు.. పోలవరం నిర్మాణానికి అనేక ఆంక్షలు,నిబంధనలతో ఆటంకం కలిగిస్తున్నారు.. అయినా మనమే సొంత నిధులతో ప్రాజెక్టు నిర్మాణం ఆగకుండా పట్టుదలతో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం.. రాష్ట్రంలో కరువు నివారణకు, నీటి భద్రతకు పోలవరం నిర్మాణమే శరణ్యం’ అని బాబు తెలిపారు.

కేంద్రం సహకరించిక పోయినా, పోరాటం చేయాల్సిన అవసరం లేకుండానే.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల బాధలను తొలగించేందుకు వారి జీతాలను పెంచామని గుర్తుచేశారు.. రాష్ట్రంలో ఇప్పటికే 75 శాతం ఉన్న సంతృప్తి 90 శాతానికి పెంచాలన్నదే తమ లక్ష్యమని చెప్పిన బాబు, ‘రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి మీ అందరూ అండగా నిలవాలని కోరారు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేస్తే 25 ఎంపీ సీట్లు సాధిస్తాం.. అప్పుడు ప్రధాని ఎవరో మనమే నిర్ణయిస్తాం.. ఫలితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు కేంద్రాన్ని దబాయించి సాధిస్తాం అన్నారు.. టీడీపీ రెండోసారి కూడా ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి కొనసాగుతుందన్న బాబు, అమలుకాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని హెచ్చరించారు.

నల్లడబ్బు వెలికితీసి ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన మోదీ.. దానిని నెరవేర్చలేదని బాబు అన్నారు.. మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించిందని విమర్శించిన బాబు, జీఎస్టీ అమలు, నోట్ల రద్దుతో దేశ ప్రజలందరికీ కష్టాలొచ్చాయని తెలిపారు.. చూద్దాం మరి బాబు కోరుకున్నట్టు టీడీపీ 25 ఎంపీ స్థానాలు గెలిచి, కేంద్రాన్ని దబాయించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు సాధిస్తుందేమో.