ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ ని ఎప్పటికీ క్షమించను: మోదీ

 

మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సే గొప్ప దేశభక్తుడంటూ భోపాల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా ప్రధాని మోదీ కూడా ప్రజ్ఞా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపూను అవమానించిన ఆమెను ఎప్పటికీ క్షమించబోనని అన్నారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 'గాంధీజీ లేదా గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. సమాజానికి తప్పుడు సందేశం ఇచ్చేవిగా ఉన్నాయి. ఆమె క్షమాపణ కోరడం వేరే విషయం. కానీ నేను మనస్ఫూర్తిగా ఆమెను ఎప్పటికీ క్షమించలేనని' మోడీ చెప్పారు.

నిజానికి ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం చెలరేగింది. ‘స్వతంత్ర భారతదేశంలో మొదటి తీవ్రవాది హిందువే, ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే’ అని కమల్ వ్యాఖ్యానించారు. కమల్‌ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి అని ప్రజ్ఞా సింగ్‌ను ఓ విలేకరి అడగగా.. ‘నాథూరామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడు. అతన్ని ఉగ్రవాది అనేవాళ్లు పునరాలోచించుకోవాలి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ప్రజ్ఞాసింగ్‌ క్షమాపణలు చెప్పారు.