టిక్కెట్ ఇవ్వకుంటే మంత్రి ఇంటి ఎదుట ఆత్మహత్య

 

కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి, అభ్యర్థులను ప్రకటించి ముందస్తుకు సిద్ధమయ్యారు కానీ.. ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు నిరసన సెగ, టిక్కెట్ దక్కని వారినుండి అసంతృప్తి సెగతో తలపట్టుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ ఇంకా 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిల్లో హుజూర్‌నగర్‌ ఒకటి. అయితే ఆ స్థానాన్ని తనకి కేటాయించాల్సిందే అంటూ హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ పట్టుబడుతున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తనకు టిక్కెట్ రాకుండా అడ్డుకుంటున్నాడని మంత్రి జగదీష్‌రెడ్డిపై ఆమె నిప్పులు చెరిగారు. జగదీష్‌ రెడ్డి బినామీ కెనడా సైదిరెడ్డి కోసం తనకు టిక్కెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సైదిరెడ్డికి టిక్కెట్ రాకుండా ఎంతకైనా తెగ్గిస్తానని శంకరమ్మ హెచ్చరించారు. తనకు టిక్కెట్ రాకుంటే సూర్యాపేటలోని మంత్రి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని మరోసారి స్పష్టం చేశారు. అన్నిచోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చారని, కానీ నాకు కేసీఆర్‌, కేటీఆర్‌లు టిక్కెట్ ప్రకటిస్తుంటే జగదీష్‌రెడ్డి కావాలనే అడ్డుపడి నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైదిరెడ్డి మంత్రికి బినామీ, ఆత్మబంధువు అని ఆరోపించారు. ఆయన మీద ప్రేమ ఉంటే సూర్యాపేట టిక్కెట్ ఇప్పించుకోవాలని ఎద్దేవా చేశారు. సైదిరెడ్డికి టిక్కెట్ ప్రకటిస్తే మలి ఉద్యమ అమరవీరుల సాక్షిగా ఆత్మార్పణ చేసుకుంటానని హెచ్చరించారు. నామీద ఎందుకు మంత్రి జగదీష్‌ రెడ్డికి కక్ష అంటూ ప్రశ్నించారు.