రాఫెల్ వివాదం.. రిలయన్స్‌ను మేమే ఎంచుకున్నాం

 

రాఫెల్ యద్ధ విమానాల కొనుగోలు అంశం ఇటీవల రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధ విమానాల తయారీ సంస్థ డసో ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా భారత్‌లోని రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసింది. ఇటీవల రాహుల్‌ ఓ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. డసో కంపెనీ సీఈఓ అబద్ధాలు చెప్తున్నారని, విచారణ మొదలైతే మోదీ తట్టుకోలేరని, అందుకు తాను గ్యారెంటీ ఇస్తానని విమర్శలు గుప్పించారు. రాహుల్‌ వ్యాఖ్యలపై డసో సీఈఓ ఎరిక్‌ ట్రాప్పీయర్‌ తాజాగా స్పందించారు. 'అంబానీని మేమే స్వయంగా ఎంపిక చేసుకున్నాం. రిలయన్స్‌ కాకుండా మాకు మరో 30 భాగస్వామ్య కంపెనీలు ఉన్నాయి. నేను అబద్ధం చెప్పను. నేను వెల్లడించిన విషయాలన్నీ వాస్తవాలే. అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. సీఈఓగా నా స్థానంలో ఉంటే.. మీరు కూడా అబద్ధాలు చెప్పరు.’ అని ఎరిక్‌ పేర్కొన్నారు.

తాము రిలయన్స్‌లో డబ్బు పెట్టడం లేదని, ఇద్దరి డబ్బు సంయుక్త వెంచర్‌లోకి వెళ్తుందని ఎరిక్‌ తెలిపారు. ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ విమానాలు కొనుగోలుకు ఒప్పందం కుదరినప్పుడు రిలయన్స్‌తో కలిసి ముందుకు వెళ్లాలని తాను నిర్ణయం తీసుకున్నానని, ఆఫ్‌సెట్‌ పార్ట్‌నర్‌గా ఉండేందుకు హాల్‌ ఆసక్తి చూపించలేదని ఆయన వెల్లడించారు. అందుకే తన నిర్ణయం ప్రకారమే రిలయన్స్‌కు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆఫ్‌సెట్‌ పార్ట్‌నర్‌ కోసం చాలా కంపెనీలతో చర్చలు జరిపామని, ఇంజనీరింగ్‌ సౌకర్యాలు అధికంగా ఉన్నందునే రిలయన్స్‌ను ఎంచుకున్నామని చెప్పారు. విమాన ధరల వివరాల గురించి కూడా ఎరిక్‌ మాట్లాడారు. గతంలో కుదుర్చుకున్న డీల్‌తో పోలిస్తే 36 యుద్ధ విమానాల కోసం కుదుర్చుకున్న ప్రస్తుత ఒప్పందంలో విమానాల ధరపై 9శాతం తగ్గించామని చెప్పారు. అయితే కాంగ్రెస్ మాత్రం డసో సీఈఓ మాటలను ఖండిస్తోంది. త్వరలోనే అసలు నిజాలు బయటికి వస్తాయని చెప్తోంది.