లోకో పైలట్ కావాలనే సిగ్నల్ జంప్ చేశాడా? కాచిగూడ ట్రైన్ యాక్సిడెంట్ లో అసలేం జరిగిందంటే..!

కాచిగూడ ట్రైన్ యాక్సిడెంట్‌పై విచారణ మొదలైంది. ఒకే ట్రాక్‌పైకి కర్నూలు ఎక్స్‌ప్రెస్‌... ఎంఎంటీఎస్ ట్రైన్ ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు ప్రారంభించింది. కాచిగూడ ట్రైన్ యాక్సిడెంట్‌ను సీరియస్‌గా తీసుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే.... అసలేం జరిగిందో తేల్చాలంటూ ముగ్గురు సభ్యులతో హైలెవల్‌ కమిటీ ఏర్పాటు చేసింది. దాంతో, యాక్సిడెంట్‌ స్పాట్‌ని పరిశీలించనున్న కమిటీ... ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించనుంది. అయితే, ఎంఎంటీఎస్ ట్రైన్ లోకో పైలట్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు అంచనా వేస్తున్నారు. సిగ్నల్ క్లియరెన్స్ లేకుండానే... ఎంఎంటీఎస్‌ రైలును లోకో పైలట్ మూవ్ చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. అయితే, సిగ్నల్‌ను కావాలనే అతిక్రమించాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే దానిపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కాచిగూడ స్టేషన్ మాస్టర్‌తోపాటు మరో ఆరుగురి స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారు. ఇదిలాఉంటే, కాచిగూడ స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఎంఎంటీఎస్ లోకో పైలట్‌ చంద్రశేఖర్‌‌పై కేసు నమోదు చేశారు. రైలును నిర్లక్ష్యంగా నడిపినందుకు ఐపీసీ 337, ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రయాణికులకు హాని చేసినందుకు సెక్షన్ 338 కింద ఎఫ్‌‌ఐఆర్ ఫైల్ చేశారు. అయితే, లోకో పైలట్ ఆరోగ్యం మెరుగైన తర్వాత అతని వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఇక, కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్‌ లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. క్రష్ ఇంజూరీస్‌తో కాళ్లకు రక్త ప్రసరణ నిలిచిపోయిందని, అలాగే... యూరిన్ అవుట్ పుట్ తగ్గిందని, కిడ్నీకి కూడా గాయాలు అయ్యాయని తెలిపారు. అయితే, చంద్రశేఖర్ ప్రస్తుతం షాక్‌లో ఉన్నారని, 24గంటల తర్వాతే ఏదైనా చెప్పగలమని వైద్యులు ప్రకటించారు.