హైదరాబాద్‌ మెట్రోలో... ఆశ నీరుగారిపోతోంది

హైదరాబాద్‌ మెట్రో రైల్‌తో ట్రాఫిక్ సమస్య నుంచి ఊరట పొందుతున్న నగర వాసులకు చిన్నచిన్న సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. రోజుకి నాలుగు లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్న మెట్రోలో ప్రయాణికులను ఇబ్బందులు వెంటాడుతున్నాయి. చిన్నచిన్న అవాంతరాలతో వేగంగా గమ్యాన్ని చేరుకోవాలన్న ప్రయాణికుల ఆశ నీరుగారిపోతోంది.

ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుంచి హైదరాబాద్ వాసులకు ఊరట కలిగిస్తూ రెండేళ్ల క్రితం అందుబాటులో వచ్చిన మెట్రో రైల్‌ మంచి సత్ఫలితాలను ఇస్తోంది. అయితే, కొత్తగా ప్రారంభించిన జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ రూట్లో మాత్రం మెట్రో ప్రయాణికులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలా రైళ్లలో డిస్‌ప్లే బోర్డులు లేకపోవడంతో తమ గమ్యాన్ని తెలుసుకోలేక అవస్థలు పడుతున్నారు.

మరోవైపు, టికెట్ల కౌంటర్ల దగ్గర రద్దీని తగ్గించేందుకు క్యూఆర్‌కోడ్ అమల్లోకి తెచ్చినా, చాలా మెట్రో స్టేషన్లలో స్కానర్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండుమూడుసార్లకు పైగా స్కాన్ చేసిన తర్వాతే గేట్లు ఓపెన్ అవుతుండటంతో క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న సమస్యలతో మెట్రో జర్నీ ఆలస్యమవుతోందని, వాటిని పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.