మాస్టర్ ప్లాన్‌కి లోబడే మెట్రో పనులు..

 

కోర్టు హైదరాబాద్‌లోని గ్రీన్ లాండ్స్ నుంచి శిల్పారామం మధ్య మెట్రో రైలు పనులు నిర్వహించడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో దీనిపై వున్న స్టేని ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మాస్టర్ ప్లాన్ ప్రకారమే మెట్రో పనులు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. గ్రీన్‌లాండ్స్ నుంచి శిల్పారామం వరకు పనులకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రీన్‌లాండ్ - శిల్పారామం మధ్య మెట్రో రైలు పనులు కారణంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరుగుతోందని గతంలో కృష్ణానగర్, యూసఫ్‌గూడ, జూబిలీహిల్స్‌కి చెందిన పలు ప్రజా సంఘాలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ చేపట్టి ఆ మార్గంలోని పనులపై 2012లో స్టే విధించారు. ఈ ఉత్తర్వులను జారీ చేస్తూ మెట్రో రైలు సంస్థ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు గతంలో విధించిన స్టే ఎత్తివేసింది.