ఎన్ కౌంటర్ తర్వాత ఊపిరి పీల్చుకున్న సజ్జనార్... దిశ ఘటన తర్వాత తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న సీపీ...

దిశ రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. సీపీ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఘటన జరిగిన నాటి నుంచి నిందితులు ఎన్ కౌంటర్ అయ్యేవరకూ సజ్జనార్ తన జాబ్ కెరియర్ లోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొన్నారు. ఒకవైపు కేసు విచారణ, దర్యాప్తు... మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ఒత్తిడి... ఇంకోవైపు పౌర సమాజం నుంచి డిమాండ్లతో సజ్జనార్ తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారని సన్నిహిత పోలీస్ వర్గాలు అంటున్నాయి. ఆనాటి వరంగల్ యాసిడ్ ఘటన కేవలం రాష్ట్రం వరకు పరిమితమైతే... దిశ సంఘటన మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం... పార్లమెంట్ ను సైతం కుదిపేయడంతో సజ్జనర్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు చెబుతున్నారు. అంతేకాదు సజ్జనార్ కు ఈ పది రోజుల్లో వేలాది ఫోన్ కాల్స్ వచ్చాయి. ప్రతి నిమిషం సజ్జనార్ ఫోన్ కు ఎస్ ఎంఎస్ లు, వాట్సప్ మెసేజ్ లు వెల్లువెత్తాయి. సజ్జనార్ కే కాకుండా ఆయన సతీమణికి కూడా తెలిసినవారి నుంచి బంధువుల నుంచి వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ అండ్ మెసేజ్ లు వచ్చాయి. 

సజ్జనార్, ఆయన సతీమణికి ఎస్ ఎంఎస్ లు, వాట్సప్ మెసేజ్ లు పంపినవాళ్లలో పలువురు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అధికారుల భార్యలు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారట. ముఖ్యంగా నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటూ అందరూ కోరినట్లు తెలుస్తోంది. దాంతో, సజ్జనార్ తీవ్రమైన ఒత్తిడిని భరించారని పోలీస్ వర్గాలు సైతం అంటున్నాయి.

సజ్జనార్ కు ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పేరు ఉండటం... దిశ ఘటన కూడా ఆయన పరిధిలోనే జరగడంతో కచ్చితంగా నిందితుల ఎన్ కౌంటర్ జరుగుతుందని పోలీస్ వర్గాలతోపాటు ప్రజలు కూడా ఊహించారు. అయితే, నిందితులు పట్టుబడిన రోజే ఎన్ కౌంటర్ కావొచ్చని అంతా అనుకున్నారు. సజ్జనార్ కూడా డీజీపీని సంప్రదించారని, అయితే తొందరపడొద్దని సూచించారని ప్రచారం జరిగింది. అయితే, నిందితుల ఎన్ కౌంటర్ కు ముందు రోజు సజ్జనార్.... హోంమంత్రి, డీజీపీ, ఇతర ప్రభుత్వ పెద్దలతో సమావేశమై చర్చించారని, గ్రీన్ సిగ్నల్ రావడంతో పని పూర్తి చేశారని అనుకుంటున్నారు. నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురవడంతో ఆయనపై ఒత్తిడి తగ్గిందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.