హైదరాబాద్ పేలుళ్ళ కేసు కంచికేనా?

 

హైదరాబాద్ బాంబు ప్రేలుళ్ళపై జరుగుతున్న దర్యాప్తు ఇప్పుడపుడే ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడంలేదు. డిల్లీ నుండి తీసుకువచ్చిన ఇద్దరు నేరస్తులు ఇక్బాల్, సయీద్ లను నగరం అంతా తిప్పినా పోలీసులకి తగిన సమాచారం మాత్రం ఏమి దొరకలేదు. అందువల్ల వారిని మళ్ళీ డిల్లీకి పంపించేసారు.

 

ఇక, ఈ కేసు దర్యాప్తులో వివిధ శాఖలు, రాష్ట్రాలకు చెందిన కనీసం ఏడూ నుండి పది వరకు బృందాలు పనిచేస్తున్నపటికీ, ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు సాగుతున్న దర్యాప్తు వల్ల కేసులో పురోగతి కనిపించలేదు. అందువల్ల, ఈ కేసులో మొదటి నుండి దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (యన్.ఐ.ఏ) కే మొత్తం బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొన్నాయి. అయితే, రాష్ట్ర పోలీసులతో బాటు ఇంతవరకు ఈ కేసు దర్యాప్తులో పనిచేస్తున్న వివిధ సంస్థలు తమ దర్యాప్తు కొనసాగించడానికి కేంద్రం అనుమతించినప్పటికీ, తమకి అందిన సమాచారం జాతీయ దర్యాప్తు సంస్థకు అందజేస్తూ ఉండాలని ఆదేశించింది.

 

అయితే, కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంలో చేసిన జాప్యం వల్ల ఇప్పటికే చాల విలువయిన కాలం గడిచిపోయింది. తద్వారా బాంబు ప్రేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు తప్పించుకోవడానికి తగిన అవకాశం కూడా కల్పించినట్లయింది. ఇటువంటి సంఘటనలు జరగడం మన రాష్ట్రంలో, దేశంలో ఇదే తొలిసారి కాకపోయినపట్టికీ, ఇంతవరకు ప్రభుత్వాలు కానీ, సంబందిత శాఖలు కానీ కొత్తగా నేర్చుకొన్నది ఏమిలేదని అర్ధం అవుతోంది.

 

ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏవిధంగా స్పందించాలి, ఎవరు స్పందించాలి, ఎవరు విచారణ చేయాలి, ఎవరు ఏ ఏ బాధ్యతలు నిర్వర్తించాలి అనే విషయాలపై ఇంకా సరయిన అవగాహన కానీ, ప్రణాళిక గానీ ఏర్పరుచుకోలేదని ఈ నిర్ణయం వల్ల అర్ధం అవుతోంది. ఇటువంటి దుర్ఘటన జరిగిన ప్రతీసారి కూడా మన భద్రతా వ్యవస్థలలో వృత్తి నైపుణ్యానికి బదులు అయోమయం కనిపించడం సామాన్య ప్రజలను సైతం ఆశ్చర్య పరుస్తుంటుంది.

 

సామన్య ప్రజలు వారు చేపట్టిన వృత్తిలో పూర్తి స్థాయిలో నైపుణ్యం చూపడం ద్వారానే వారి జీవిక పొందగలుగుతున్నారు. కానీ, దేశ రక్షణ, అంతర్గత భద్రత వంటి కీలక వృత్తిని చేపట్టిన వ్యక్తులు మాత్రం ఈవిదంగా తరచూ అయోమయంగా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః వ్యక్తుల మద్య, వ్యవస్థల మద్య సరయిన సమాచార మార్పిడి లేకపోవడం, రాజకీయాలు, బేషజాలు మొదలయినవి ఈ అయోమయానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చును. అయితే, ఇటువంటి చిన్న సమస్యలను సైతం అధిగమించలేని సదరు బృందాలు, ప్రభుత్వాలు ఇక కీలకమయిన దర్యాప్తులు ఏవిధంగా కొనసాగించగలవనే అనుమానం ప్రజలలో కలగడం సహజం.

 

అయినప్పటికీ, ఇంతవరకు సదరు సంస్థల పనితీరులో కానీ, ప్రభుత్వం ఆలోచన తీరులో గానీ పెద్ద మార్పు లేకపోవడం విడ్డూరం. ఇప్పటికయినా ప్రభుత్వాలు మేల్కొని ఇటువంటి దాడులను అరికట్టేందుకు, ఇటువంటి కేసులను పరిష్కరించేందుకు తగిన భద్రతా వ్యవస్థను, ప్రణాళికను ఏర్పరుచుకోకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలే అవుతుంటాయి.