వైసీపీ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం.. నడిరోడ్డుపై బర్త్ డే వేడుకలు

 

సామాన్యులు రోడ్ పక్కన బైక్ ఆపితేనే.. నో పార్కింగ్ అంటూ ఫైన్ వేస్తారు. కానీ ఓ ప్రజాప్రతినిధి కొడుకు నాలుగు రోడ్ల జంక్షన్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని.. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే అడిగే నాథుడే లేడు.

ఎవరైనా పుట్టినరోజును తమ ఇళ్లవద్దగానీ, ఫంక్షన్ హాల్లోగానీ జరుపుకుంటారు. కానీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు మాత్రం.. పుట్టినరోజు వేడుకలను ఇంట్లో చేస్తే ఏం మజా ఉంటుందిలే అనుకున్నాడేమో.. ఏకంగా నాలుగు రోడ్ల జంక్షన్ లో వేడుకలను ప్లాన్ చేశాడు. భారీగా అనుచరగణాన్ని పిలిపించుకున్నాడు. దీంతో వాహనదారులు భారీ ట్రాఫిక్ లో చిక్కుకుని 2 గంటలకు పైగా నరకం అనుభవించారు. కనీసం ద్విచక్రవాహనాలు సైతం ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీనంతటికి కారణంర పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు తనయుడు వికాశ్.

తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కొడుకు చేసిన నిర్వాకంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో తప్పు లేదు. కానీ ఇలా నడిరోడ్డుమీద జరుపుకొని ప్రజలను ఇబ్బంది పెట్టడమే తప్పు. అసలే అది నాలుగు రోడ్ల సెంటర్ కావడంతో నాలుగువైపుల నుంచి వచ్చే వాహనాలు ఎటూ కదలలేని పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా స్కూలు, కాలేజ్ ల నుంచి ఇళ్లకు వెళ్లే విద్యార్థులు, సుదూర ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకొని ఇలా ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించడంపై స్ధానికులు మండిపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు కావడంతో పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహించారని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.