కష్టాల తెలంగాణ.. లక్ష బిల్లులు పెండింగ్!!

తెలంగాణ రాష్రంలో సీఎం కేసీఆర్ పాలన చాలా నిశ్శబ్దంగా సాగుతుంది. పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వ శాఖల్లో రాష్ట్రం మొత్తం సుమారు లక్ష బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 20,000 కోట్ల రూపాయలకు పైగా బకాయలు చెల్లించాల్సి ఉందని సమాచారం. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అధికారికంగా అంగీకరించడం విశేషం. పెండింగ్ బకాయిల వివరాలు తెలపాలంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్త జి శ్రీనివాసరావు చేసిన దరఖాస్తుకు ప్రభుత్వం ఈ మేరకు సమాధానమిచ్చింది.

ఆర్థిక సంక్షోభంతో రాష్ట్రంలో పెండింగ్ బిల్లులకు మోక్షం లభించడం లేదు. ఆర్ధిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్నా ప్రభుత్వం బిల్లుల్ని క్లియర్ చేయలేక పోతుంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన కల్యాణలక్ష్మి, రైతుబంధు బట్టి సంక్షేమ పథకాలకు నిధుల మంజూరు కాలేదు. ఖరీఫ్, రబీ సీజన్ లకు సంబంధించి దాదాపు 3,000 కోట్ల వరకు రైతుబంధు బకాయిలు పేరుకు పోయిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా మూడు లక్షల వరకు కల్యాణలక్ష్మి,, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తోంది. పరిశ్రమలకు రాయితీల కింద 1,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. తాత్కాలిక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొని ఉంది. విద్యార్థులకు ఉపకార వేతనాలు, కాలేజీలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ కూడా భారీ ఎత్తున బకాయిలే ఉన్నాయి. అలాగే.. పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే ప్రయోజనాల కోసమూ పలువురు నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా మరికొన్ని జిల్లాల్లో ఆసరా పింఛన్ లు కూడా ఒకటి రెండు నెలలు ఆలస్యంగా అందిస్తున్నట్లు సమాచారం.