హుదూద్ తుఫాను భారీ విధ్వంసం

 

హుదూద్ తుఫాను ఉత్తరాంధ్రని అతలాకుతలం చేసింది. తుఫాను ఆదివారం ఉదయం పదిన్నర ప్రాంతంలో విశాఖ కైలాసగిరి వద్ద తీరాన్ని తాకింది. అనంతరం మధ్యాహ్నం విశాఖ సమీపంలోని పూడిమడక వద్ద తీరాన్ని దాటింది. దీంతో తీరం వెంబడి గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ తుఫాను అల్పపీడనంగా మారే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫాను ప్రభావం కారణంగా విశాఖ జిల్లాలో ఎనిమిది మంది మరణించినట్టు సమాచారం అందుతోంది. తుఫాను విశాఖ పట్టణంలో విధ్వంసం సృష్టించింది. అనేకచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్, రవాణా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రజలు ఇళ్ళలోంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్టణంలో వందలాది కార్లు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్ళలోకి భారీగా నీరు వచ్చింది. విశాఖ రాడార్ కేంద్రంలోకి కూడా నీరు వచ్చింది. ఎయిర్ పోర్టు కప్పు ఎగిరిపోయింది.