కొరివితో తల గోక్కొంటున్న షిండే గారు!

 

హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే గతంలో రెండు మూడు సార్లు అనవసరంగా నోరు జారి తానూ ఇబ్బందులలో పడటమే కాకుండా, తన కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టారు. ఆయన చేసిన ‘నెల రోజుల్లో తెలంగాణా’ వాగ్దానం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బందులకు గురయిందో అందరికీ తెలిసిందే. చివరికి గులంనబీ ఆజాద్ కలుగజేసుకొని ‘నెలంటే ముప్పై రోజులు కాదు’ అని ఒక కొత్త భాష్యం చెప్పి కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేసాడు మాహానుభావుడు. నాటి నుండి తెలంగాణా విషయంలో నిశ్చింతగా కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి షిండే మళ్ళీ తన సరికొత్త వ్యాక్యలతో తలనొప్పులు తెచ్చిపెట్టారు.

 

తెరాస తదితర తెలంగాణా వాదులు ఎన్నికల సీజన్ వచ్చినందున తెలంగాణా అంశాన్ని పక్కన బెట్టడంతో రాష్ట్రంలో బయట వాతావరణంతో బాటు రాజకీయ వాతావరణం కూడా చాలబడి బాగా ప్రశాంతంగా ఉందని ప్రజలు సంతోష పడుతుంటే, హోం మంత్రి షిండేగారు తెలంగాణా పై మళ్ళీ అనవసరంగా నోరు విప్పి అగ్గి రాజేశారు.

 

“నేను నెలరోజుల్లో తెలంగాణా ప్రకటిస్తానని ఎన్నడూ, ఎవరితోను చెప్పలేదు. కేవలం నెల రోజుల్లో తెలంగాణా అంశంపై నా నివేదిక ఇస్తానని మాత్రమే చెప్పాను. చెప్పిన మాట ప్రకారమే నా నివేదికను కేంద్రానికి అందజేసాను. ప్రస్తుతం దాని మీదే చర్చ జరుగుతోంది. అయినా, తెలంగాణా అంశం ఇప్పటికిప్పుడు తేల్చే విషయం కాదు. తెలంగాణా ఇచ్చినట్లయితే, దేశంలో విదర్భవంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండులు చాలా తలెత్తుతాయి. అందువల్ల నిర్ణయం తీసుకోవాలన్నాకూడా దేశంవ్యాప్తంగా ఏర్పడే పరిస్థితులను పరిగానణలోకి తీసుకొనే నిర్ణయం చేయవలసి ఉంటుంది”అని అన్నారు.

 

ఆయన ఈ విధంగా పనిగట్టుకొని మరీ తెలంగాణా వాదులను రెచ్చగొట్టి కోరుండి కొరివితో తల ఎందుకు గోక్కోవాలని ప్రయత్నిస్తున్నారో తెలియదు. ఈవిధంగా అప్రస్తుత ప్రసంగం చేసి కాంగ్రెస్ తెలంగాణాకు వ్యతిరేఖం అని ఆయనే స్వయంగా చాటింపు వేసుకోన్నట్లు అవుతుంది. కేంద్రంలో ఉన్న ఆయనకు తెలంగాణా వాదులనుండి కొత్తగా వచ్చే ఇబ్బందులేవీ లేకపోవచ్చును, కానీ, ఆయన చేస్తున్న ఇటువంటి ప్రకటనల వల్ల తెలంగాణా కాంగ్రెస్ వాదుల గుండెల్లో మాత్రం రైళ్ళు పరిగెట్టిస్తుంటాయి. స్థానికంగా ఉండే వారికి ఆయన మాటలు కొత్త సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

 

ప్రస్తుతం తెలంగాణా కావాలని ఎవరూ ఆయన వెంటబడటం లేదు. తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీతో పోరాటాలు చేసి చేసి అలిసిపోయున్న తెరాస కూడా ఇక ఎన్నికలే శరణ్యం అని భావిస్తూ, ఎన్నికలకి పూర్తి స్థాయిలో సంసిద్ధం అవుతుంటే, ఇటువంటి సమయంలో షిండేగారు ఈ అనవసరమయిన ప్రకటనలు చేయడం ఎంత మాత్రం సబబు కాదు. తద్వారా రాష్ట్రంలో అయన పార్టీకే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది.