ఇంటి అలంకరణలో ఫ్లవర్‌వాజ్‌ ప్రత్యేకత

 

తాజా పూలతో ఫ్లవర్‌వాజ్‌ను అలంకరించి హాలులోని టేబుల్‌పై పెడితే ఇంటికి అందంగా ఉండడమే కాకుండా, మనసుకు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మరి అటువంటి అలంకరణలో ఎలాంటి పువ్వులు వాడాలి, వాటిని ఎలా అలంకరించాలో తెలుసుకుందామా!

 

- ఫ్లవర్‌వాజ్‌లో పువ్వులు అలంకరించేటప్పుడు, పువ్వులతో పాటు మధ్యమధ్యలో ఆకులు కూడా పెట్టాలి. ఆకులు నీళ్లలో మునగకూడదు. అదే పూల ఆకులు కాకుండా వేరు ఆకులతో అలంకరిస్తే ఫ్లవర్‌వాజ్‌ అందంగా ఉంటుంది.

- బాగా వికసించిన ముదురురంగు పువ్వులు మధ్యలో ఉంచి, అరవిరిసిన పువ్వులు చుట్టూరా పెట్టాలి. ఇలా చేస్తే అవి కూడా విచ్చుకుంటాయి.

 

- ఎరుపు, నేరేడు రంగు, ముదురు రంగు పువ్వులు ఒకేచోట కాకుండా మ్యాచింగ్‌ ఉండేలా చూడాలి. పువ్వుల రంగులు ఆ గది రంగుకి మ్యాచ్ అయ్యే విధంగా పెట్టాలి. అలాగని మనకు నచ్చని రంగుల పువ్వులను పెట్టడం కాదు. అలా పెట్టే పువ్వులు ముందుగా మనకు ఆహ్లదాన్ని కలిగించాలి.

- ఫ్లవర్‌వాజ్‌ లోపల, బయట శుభ్రంగా కడిగి అందులో నీరు నింపాలి. నీళ్లల్లో కాస్తంత ఉప్పు కలిపితే పువ్వులు ఎక్కువ కాలం ఉంటాయి.


- ఫ్లవర్‌వాజ్‌ ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నచోట పెట్టకుండా తాజా గాలి వచ్చే చోట పెట్టాలి. దీనివల్ల తాజాగా ఉంటాయి.

 

- ఇంట్లో ఇండోర్‌ ప్లాంట్స్‌, మనీప్లాంట్స్‌ కొన్ని రకాల క్రోటన్‌ మొక్కలు కుండీలో వేసి గదుల్లో డ్రాయింగ్‌రూంలో అలంకరించుకోవచ్చు.


- ఫ్లవర్‌వాజ్‌ అనేది కేవలం పువ్వులు మాత్రమే బాగుంటే సరిపోదు. ఆ పువ్వులు పెట్టే ఫ్లవర్‌వాజ్‌ కూడా అందంగా, ఆకర్షనీయంగా ఉండేలా చూసుకోవాలి.