అమరావతిలో యుద్ధ వాతావరణం... జైల్ భరోతో టెన్షన్ టెన్షన్....

ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశంకానుంది. మూడు రాజధానుల ప్రతిపాదన, సీఆర్డీఏ చట్టం రద్దు లాంటి కీలక బిల్లులను ఉభయసభల్లో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే, అమరావతి ఆందోళనలు పెద్దఎత్తున సాగుతుండటంతో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి, విపక్షాలు కలిసి ఛలో అసెంబ్లీ, జైల్ భరోకి పిలుపునివ్వడంతో ఆంక్షలు విధించారు. కేబినెట్ మీటింగ్, అలాగే అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అమరావతి పరిసరాల్లో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లోకి ఉన్నందున ఆంక్షల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు, అమరావతి పరిరక్షణ సమితి, వివిధ రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని విజయవాడ సీపీ తెలిపారు. అలాగే, ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ ఉద్యోగుల వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు.

అయితే, ఎన్ని ఆంక్షలు విధించినాసరే అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించి తీరుతామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని జగన్ ధ్వంసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని కొనసాగించాలని పోరాటం చేస్తున్న మహిళలపై పోలీసులతో దాడులు చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ముట్టడిని విఫలంచేసేందుకు అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం అన్యాయమన్నారు. పోలీసుల అణచివేత చర్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో కూడా ఇంతటి నిర్బంధం లేదని చంద్రబాబు విమర్శించారు. నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేదా అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.