ప్రియాంకా ఘటనతో ఉప్పొంగిన ఆవేశం.. ఆ నీచుల్ని మేమే చంపేస్తాం

 

మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలతో సామాన్యుల్లో కోపం కట్టలు తెచ్చుకుంటోంది. ఇంకోసారి ఆడవారిపై చెయ్యి వేయాలంటేనే భయపడేలా.. నడిరోడ్డు మీద ఉరితీయాలని, ఎన్కౌంటర్ చేయాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక యువత అయితే.. అలంటి దుర్మార్గులని రాఖీ సినిమాలో లాగా పెట్రోల్ పోసీ సజీవ దహనం చేయాలనీ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వరుస ఘటనలు సామాన్యుల్లో ఆవేశం కట్టలు తెంచుకునేలా చేసాయి. ముఖ్యంగా హైదరాబాద్ షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని నలుగురు దుర్మార్గులు అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేయడంతో.. ఆ నలుగుర్ని చంపేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి, హతమార్చిన నిందితులను షాద్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తున్నట్లు తెలుసుకున్న స్థానికులు, ప్రజా సంఘాల కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుల్ని వెంటనే ఉరితీయాలని, లేదా ఎన్కౌంటర్ చేయాలనీ డిమాండ్ చేశారు. లేదా అసలు నేరస్థుల్ని తమకు అప్పగించండి.. ఏం చేయాలో చేసి చూపిస్తాం.. అంటూ పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకొనేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జనాన్ని చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీ ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. అయినా జనం వెనకడుగు వేయలేదు. దీంతో ఇక చేసేదేం లేక స్టేషన్ గేటును మూసేశారు పోలీసులు. గేటుకు వేయడానికి తాళాలు లేకపోవడంతో.. దానికి బేడీలు వేశారు. నిందితులను బయటకు తీసుకెళ్తే జనావేశాన్ని కంట్రోల్ చేయడం కష్టమని భావించిన పోలీసులు.. నిందితుల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించాల్సి ఉన్నా.. పరిస్థితి దానికి అనుకూలంగా లేకపోవడంతో.. డాక్టర్లనే స్టేషన్ కి తీసుకొచ్చి  మరీ పరీక్షలు చేయించారు. అంతేకాదు పరిస్థితి తెలిసి మేజిస్ట్రేట్ పాండు నాయక్ కూడా స్వయంగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. నిందితులకు 14 రోజుల రిమాండ్‌ను విధించారు. ఇక ఈ నలుగురు దుర్మార్గులను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజల కంట పడకుండా మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.