కమిటీలు నామమాత్రమే.. విశాఖలో మొదలైన అద్దె భవనాల వేట

ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు , బిసిజి కమిటీలు ఇచ్చిన నివేదికల అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తొలిసారిగా సమావేశంకానుంది. కమిటీ సభ్యులైన పది మంది మంత్రులు , ఆరుగురు ఉన్నతాధికారులు ఇవాళ విజయవాడ లోని ఏపీసీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో భేటీ కానున్నారు. సోమవారమే ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కమిటీలోని పలువురు మంత్రుల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడంతో నేటికి వాయిదా పడింది. గత కొన్నేళ్లుగా రాష్ర్టానికి పూర్తిస్థాయి రాజధానిగా ఉన్న అమరావతిని కానిస్ట్యూషనల్ క్యాపిటల్ గా మాత్రమే ఉంచాలని నిర్ణయించింది. సచివాలయం, సీఎం క్యాంపు ఆఫీస్ తదితరాలను విశాఖపట్నానికి.. హైకోర్టును కర్నూలుకు.. మార్చాల్సిందిగా జీఎన్ రావు , బీసీజీ కమిటీ తమ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి విదితమే. ఆ కమిటీలు నివేదికలను సమర్పించక ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు ముక్కల రాజధాని ప్రతిపాదనను సాక్షాత్తు శాసనసభలోనే బహిర్గతం చేశారు. అప్పటి నుంచి రాజధాని రైతులు అమరావతి శ్రేయోభిలాషులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 

కమిటీలను నియమించక మునుపే సీఎం మూడు ముక్కల రాజధానికి నిర్ణయం తీసుకున్నారని ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపించకుండా ఉండేందుకే ఈ కమిటీల పేరిట తంతు నడిపిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో జీఎన్ రావు బీసీజీ కమిటీల నివేదికలపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి తగు సూచనలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు అంతకంతకూ ఉదృతమవుతుండటాన్ని దృష్టిలో పెట్టుకుని మూడు ముక్కల రాజధాని వద్దంటూ హై పవర్ కమిటీ ప్రభుత్వానికి సహేతుకమైన సూచనలు ఇవ్వనుందా లేక తూతూ మంత్రంగా రాజధాని వికేంద్రీకరణకే ఓటు వేస్తుందా అనే దానిపై ఈ సమావేశంతో స్పష్టత వచ్చే అవకాశముంది. 

మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలను వీలైనంత త్వరగా విశాఖపట్నానికి తరలించేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు జనవరి 20వ తేదీ లోగా అద్దె భవనాలు చూసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ ఆయా అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం ఏర్పాటుకు విశాఖలోని మిలీనియం టవర్ ను ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసింది. కీలక శాఖలను ముందుగా తరలించి మిగిలిన శాఖలను విడతల వారీగా తరలించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే శాఖాధిపతుల కార్యాలయాల కోసం తీసుకునే భవనాలకు ఎంత అద్దె చెల్లించాలనేది నిర్ణయించలేదు. గతంలో హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించినపుడు చదరపు అడుగుకు పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అద్దె నిర్ణయించారు. ఇరవై రూపాయలు దాటితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.