హై పవర్ కమిటీ మూడవ సమావేశం.. తుది నిర్ణయం!

మూడు రాజధానుల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో హైపవర్ కమిటీ నేడు మూడో సారి సమావేశం కానుంది. ఇప్పటికే జీఎన్ రావు, బోస్టన్ కమిటీలపై చర్చించిన హైపవర్ కమిటీ సీఎం జగన్ తో సమావేశమై కీలక అంశాలపై మంతనాలు జరిపింది. నేటి మీటింగ్ లో చాలా అంశాల పై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. జనవరి చివరి నాటికి మూడు రాజధానుల ప్రక్రియను ఓ కొలిక్కి తెచ్చే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుంది.అమరావతి రాజధాని మార్పుపై ఇప్పటికే హైపవర్ కమిటి రెండుసార్లు భేటి అయ్యింది. జనవరి 20 వ తేదీన ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నారు. ఆ తరువాత కేబినెట్ భేటీ, అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏపి రాజధానిపై తేల్చేసేందుకు సర్కారు రెడీ అవుతుంది. 

ఈ సమయంలో ఒక వైపు అమరావతిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు..మరో వైపు చంద్రబాబు జోలిపట్టి ఉద్యమము సాగిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు ఏపీలో వేడి పెంచుతున్నాయి. ఈ తరుణంలో రాజధానిపై త్వరగా ఓ క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏపి అసెంబ్లీలో జనవరి 20న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజధానితో సహా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశముంది.  జనవరి 18 న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. 

ఇప్పటికే జియన్ రావు కమిటి, బోస్టన్ గ్రూప్ నివేదికలు అందజేశాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటి వికేంద్రీకరణకే మొగ్గు చూపింది. ఒకేచోట అభివృద్ధి కేంద్రీకృతం అవ్వకూడదని అభిప్రాయ పడిన కమిటి రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించాలని సూచించింది. అసెంబ్లీ, హై కోర్టు, సచివాలయం ఏర్పాటుపై కీలక సూచనలు చేసింది. ఇటు మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగానే బోస్టన్ గ్రూప్ రిపోర్టు అందజేసింది. జియన్ రావు కమిటి , బీసీజీ రిపోర్ట్ లను అధ్యయనం చేసేందుకు కేబినెట్ మంత్రులతో నియమించిన హైపవర్ కమిటీ ఇవాళ మూడోసారి సమావేశం కానుంది. తొలి సమావేశంలో జియన్ రావు కమిటి , బీసీజీ ప్రతినిధులతో భేటీ అయిన హైపవర్ కమిటీ రెండో సమావేశంలో ఉద్యోగులకు కల్పించాల్సిన వసతులపై ప్రధానంగా చర్చించింది. కేబినెట్ భేటీలో నివేదిక అందజేసే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఇక నేటి సమావేశంతో చాలా అంశాల పై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.