రాజధాని మార్పు ఫిక్స్... రైతులకి జగన్ సర్కార్ ఆఫర్స్!!

రాజధాని విభజన వ్యవహారం తుది అంకానికి చేరుకున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మూడు సార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ.. ఈరోజు సీఎం జగన్ సమక్షంలో సమావేశమైంది. ఈ మీటింగ్ లో అనేక అంశాలపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఒక పక్క రాజధాని మార్పుపై ఆందోళనలు కొనసాగుతున్నా.. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. ప్రస్తుతమున్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో అమరావతి డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేసే దిశగా తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

ఇక ల్యాండ్ పూలింగ్ రైతులకు గత ప్రభుత్వం ఇస్తానన్న రిటర్నబుల్ ప్లాట్ల అంశాలపైన సీఎంతో భేటీలో హైపవర్ కమిటీ చర్చించినట్టు తెలుస్తోంది. ఆందోళన చేస్తున్న రాజధాని రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలనే అంశంపైన కీలక చర్చ జరిగినట్టు సమాచారం. ప్లాట్లు వద్దనుకునే రైతులకు భూమిని తిరిగి ఇవ్వాలన్న ప్రతిపాదనపైన భేటీలో చర్చించారని తెలుస్తోంది. వీలుంటే గతంలో వారిచ్చిన భూమిని తిరిగిచ్చేయాలని.. కుదరని పక్షంలో అందుబాటులో ఉన్న వేరే భూమి కేటాయించాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.  మరోవైపు అమరావతి రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది.

ఇక రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి విషయంలో సీఆర్ డీఏ మాస్టర్ ప్లాన్ తరహా ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వడం సాధ్యం కాదన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రైతుల అభ్యంతరాలను సీఆర్ డీఏ ద్వారా సేకరించే పనిలోపడ్డ ప్రభుత్వం వచ్చిన వినతుల ఆధారంగా తుది నిర్ణయానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.మరో వైపు ఈ నెల 20 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మూడురోజులపాటు జరిగే సమావేశాల్లోనే రాజధానిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది.