తెలంగాణ సర్కార్ కి హైకోర్టు అక్షింతలు.. ఆ జీవోలు వెబ్ సైట్ లో పెట్టండి!

తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షంతలు వేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెబ్ సైట్ లో పెట్టకుండా రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని హైకోర్టు డివిజన్ బెంచ్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గతేడాది సెప్టెంబర్ లోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంత వరకు కౌంటర్ ఎందుకు వెయ్యలేదని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యంలో ఫిబ్రవరి 28లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. 

ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్ లలో పెట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగటం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి నుండి 2019 ఆగస్టు 15 వరకు మొత్తం ఒక లక్షా నాలుగు వేల నూట డెబ్బై యొక్క జీవోలు జారీ చేసిందని వివరించారు. 42,462 జీవోలను రహస్యంగా ఉంచిందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా వ్యవహరించలేదని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం చాలా జీవోలను వెబ్ సైట్ లో పెట్టడం లేదని తెలిపారు. ప్రభుత్వం సీక్రెట్ గా ఉంచిన జీవోలను వెంటనే వెబ్ సైట్ లో పెట్టేలా ఆదేశించాలని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసేందుకు ఒక అధికారిని బాధ్యుడిగా నియమించాలని కోరారు.