ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం ఎలా అవుతుంది? ఎస్మా కిందకి రాదంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

 

ఆర్టీసీ కార్మికుల సమ్మెను చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం పరిధిలోకి ఆర్టీసీ రాదని స్పష్టంచేసింది. ఆర్టీసీ ప్రజోపయోగ సర్వీసుల పరిధిలోకి వస్తుందని, ఒకవేళ ఎస్మా కింద చర్యలు తీసుకోవాలంటే... ఆర్టీసీని అత్యవసర సేవల విభాగంలోకి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపింది. ఆర్టీసీ సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ పిటిషనర్ కోరడంతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీని తప్పనిసరి సర్వీస్‌గా పేర్కొంటూ జారీ చేసిన జీవో చూపాలని కోరింది. ఆర్టీసీని పబ్లిక్‌ యుటిలిటీ సర్వీస్‌ గా ప్రకటించినందున ఎస్మా పరిధిలోకి వస్తుందని వాదించగా.. ప్రజా ప్రయోజన సేవలన్నీ అత్యవసర సర్వీసులు కావని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో ఇస్తేనే అత్యవసర సర్వీసుగా ఉంటుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

అయితే, పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్‌ 24 కింద సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించవచ్చని, అలాగే ఆర్టీసీ యాజమాన్యం కోరితే కన్సీలియేషన్‌ అధికారి చట్ట నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవచ్చన్నారు. కన్సీలియేషన్(రాజీ) విఫలమైనప్పుడు సంబంధిత అధికారి ప్రభుత్వానికి నివేదించవచ్చని, అయితే, ఆ నివేదికను లేబర్ కోర్టుకు పంపాలా? వద్దా? అనేది ప్రభుత్వమే తేల్చుకోవాల్సి ఉంటుందన్నారు. లేదంటే కన్సీలియేషన్ నివేదికను హైకోర్టు ద్వారా లేబర్ కోర్టుకు పంపవచ్చని, కానీ ఆర్టీసీ యాజమాన్యం అలా చేయనందున ఇప్పుడు సమ్మె చట్టవిరుద్ధమని ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అయినా యంత్రాలు వెళ్లలేని చోటుకి మూర్ఖులే వెళ్తారన్న హైకోర్టు.... అలాగే తాము వెళ్లదలుచుకోలేదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇక, సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని పలుమార్లు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలను కోరామని, కానీ ఏ ఒక్కరూ మెట్టు దిగడం లేదని, అలాంటప్పుడు తాము చేయగలిగిందేమీ లేదని హైకోర్టు నిర్వేదాన్ని వ్యక్తంచేసింది. ఇకపై చర్చలు జరపాలంటూ తాము ఎవరినీ కోరబోమని, ఈ వ్యవహారాన్ని చట్ట పరిధిలోనే తెలుస్తామని తేల్చిచెప్పింది. అలాగే, ఉద్వేగాలు, సానుభూతి ఆధారంగా కేసులను తేల్చడం సాధ్యంకాదని స్పష్టంచేసింది. అయితే, మాటలతో సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో లీగల్‌గా ప్రొసీడ్ అవుతామన్న హైకోర్టు... ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుందో చూడాలి.