విశాఖ ఘటనపై హైకోర్టు సీరియస్.. వాళ్లకో రూల్, వీళ్లకో రూలా?

టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో నిన్న విశాఖ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కాన్వాయ్ ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్ పైకి కోడిగుడ్లు, టొమాటోలు, చెప్పులు విసిరారు. పోలీసులు వారిని నిలువరించలేక చంద్రబాబుని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. అనుమతి ఇచ్చి ఇలా అడ్డుకోవడం ఏంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరోవైపు, ఎయిర్ పోర్ట్ వ్యవహారంపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారపక్షానికి ఒక రూల్‌, ప్రతిపక్షానికి మరో రూల్‌ ఉంటుందా?.. చట్టం ముందు అందరూ సమానమే కదా? అని ప్రశ్నించింది. అనుమతి ఇచ్చిన తర్వాత 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని క్వశ్చన్ చేసింది. ముందస్తు అరెస్ట్‌ చేయాల్సింది దాడి చేయడానికి వచ్చిన వాళ్లని కదా?.. మరి, ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?.. ఎయిర్‌పోర్టుకు రాకుండా వాళ్లని ఎందుకు నిలువరించలేకపోయారు? అని హైకోర్టు నిలదీసింది. దీనిపై వచ్చే నెల 2న కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీ, విశాఖ సీపీని ఆదేశించింది. అదే రోజే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.