జగన్ పిటీషన్ విచారణ వాయిదా.. శ్రీనివాస్‌ రిమాండ్‌ పొడిగింపు

 

విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కత్తి దాడి ఘటనపై జగన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కత్తి దాడి ఘటనపై స్వతంత్ర్య దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలంటూ జగన్ పిటీషన్ లో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై నమ్మకం లేదని, అది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతోందన్నారు. ఈ పిటీషన్ లో సీఎం చంద్రబాబుతో సహా ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. కాగా జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదికను సీల్డ్‌కవర్‌లో అందజేయాలని ఏపీ పోలీసులను కోర్టు ఆదేశించింది. 

శుక్రవారం పిటీషన్ హైకోర్టులో విచారణకు రాగా జగన్ తరపు న్యాయవాది సివి.మోహన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తీరు, పోలీసుల విచారణ హాస్యాస్పదంగా ఉందని, ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరిగితే కిందిస్థాయి ఉద్యోగులతో విచారణ జరుపుతున్నారని వాదనలో పేర్కొన్నారు. జగన్‌ మెడపై కత్తి తగిలి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని అన్నారు. జగన్‌పై హత్యాయత్నంలో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆపరేషన్ గరుడ గురించి కూడా జగన్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. వాదనలు విన్న కోర్టు దాడి జరిగిన తర్వాత పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా వెంటనే విమానంలో హైదరాబాద్‌ ఎందుకు వచ్చారు, ఏపీ పోలీసుల విచారణకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించింది. గాయంతో హైదరాబాద్‌ ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పాలని ఆదేశించింది. దీనిపై జగన్‌ తరపు న్యాయవాది స్పందిస్తూ.. ఏపీ పోలీసుల వ్యవహార శైలి నమ్మశక్యంగా లేదని.. అందుకే జగన్‌ వారికి వాంగ్మూలం ఇవ్వలేదని స్పష్టం చేశారు. జగన్‌పై దాడి కేసును రాష్ట్రానికి సంబంధం లేని సంస్థతో విచారణ జరిపించేలా ఆదేశించాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన సిట్ నివేదికను వచ్చే మంగళవారానికి సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

మరోవైపు జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాస్‌కు విశాఖ మూడో మెట్రో పాలిటన్‌ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. ఈ నెల 23 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. శ్రీనివాస్‌ రిమాండ్‌ నేటితో ముగియడంతో పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి శ్రీనివాస్‌ రిమాండ్‌ పొడిగించారు. దీంతో పోలీసులు అతడిని జైలుకు తరలించారు.