ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండి... కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లో ప్రక్రియను ముగించాలని సూచించింది. అలాగే, చర్చల సారాంశాన్ని ఈనెల 28న కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ఈ సమస్య... ఆర్టీసీ కార్మికులది, ప్రభుత్వానిది కాదని... ప్రజలదంటూ కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు.... సమ్మె విరమించాలని సూచించింది. ప్రజాసామ్యంలో ప్రజలే శక్తివంతులన్న హైకోర్టు.... ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రజలు ఆగ్రహిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని, అందుకు ఫిలిప్పీన్స్‌ రాజుపై ప్రజల తిరుగుబాటే ఒక ఉదాహరణ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరూ గొప్పవారు కాదన్న సంగతి ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని సూచించింది.

ఇక, ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే, ఆర్టీసీకి సమర్ధవంతుడైన ఇన్‌ఛార్జ్ ఉన్నారని ప్రభుత్వం తెలపడంతో.... న్యాయస్థానం మండిపడింది. సమర్ధుడైన ఇన్‌ఛార్జ్ ఉంటే.... మరి ఆర్టీసీ సమ్మెను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించింది. అయితే, కొత్త ఎండీ నియామకానికి... ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి సంబంధం లేదని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో 50శాతం న్యాయబద్ధమైనవేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. 20 డిమాండ్లు ఆర్ధికభారం కానివేనని, మరి వాటిని నెరవేర్చడంలో అభ్యంతరమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించామని, కానీ చర్చలు జరుపుతుండగానే, సమ్మెకు వెళ్లారని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటేనే కార్మికులు చర్చలకు వస్తామంటున్నారని సర్కారు వివరణ ఇచ్చుకుంది.

ఆర్టీసీ పీకల్లోతు అప్పుల్లో ఉందన్న ప్రభుత్వం... ప్రతి ఏటా 4వేల 882కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే.... ఖర్చు మాత్రం 5వేల 811కోట్లగా ఉందని, దాంతో ఏటా సుమారు 12వందల కోట్లు నష్టం వస్తోందని తెలిపింది. అయినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత... ఆర్టీసీ కార్మికుల జీతాలను 67శాతం పెంచామని, అలాగే ప్రభుత్వం తరపున నిధులను కేటాయించామని వివరించింది. ఆర్టీసీ ఆదాయ వ్యయాల్లో అంతులేని వ్యత్యాసం ఉండటంతో... సంస్థను కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే.... కార్మికులు అడుగడుగునా అడ్డుతగులుతున్నారంటూ ప్రభుత్వం వాదనలు వినిపించింది.

అయితే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం... తండ్రి పాత్రను పోషించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక, స్కూల్స్ ఓపెనింగ్‌తోపాటు రాష్ట్ర బంద్‌ పై మీ స్పందన ఏమిటంటూ ప్రభుత్వాన్ని అడగగా, శాంతియుతంగా బంద్ చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది... హైకోర్టుకు తెలిపారు.