తెలంగాణలోనే కాదు ఏపీలోను ఎన్నికలు

 

నిన్న తెలంగాణకు నేడు ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి హై కోర్ట్ షాకిచ్చింది.రెండు రాష్ట్రాల్లో పంచాయితీ సర్పంచుల పదవీ కాలం ముగిసింది.కానీ ఎన్నికలు జరపలేదు.దీంతో ఎన్నికలు ఎందుకు జరపాట్లేదని హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.తెలంగాణలో తెరాస ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలు జరపకుండా ప్రత్యేక అధికారులను నియమించి పరిపాలన కొనసాగిస్తుంది.దీనిపై కోర్ట్ లో పిటిషన్ దాఖలు కాగా విచారణ జరిపిన కోర్ట్  ప్రత్యేక అధికారులను నియమించటం రాజ్యాంగ విరుద్ధమని 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించినది విదితమే.తాజాగా కోర్ట్  ఆంధ్ర ప్రదేశ్ లోను పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీల కాల పరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించేలా జీవో 90ని తీసుకొచ్చింది.దీన్ని వ్యతిరేకిస్తూ మాజీ సర్పంచులు హై కోర్ట్ ను ఆశ్రయించారు.కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని,ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగుల్ని నియమిస్తోందని,వారికి పాలనపై పట్టు ఉండటం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.దీని వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై వాదోపవాదాలు విన్న హై కోర్ట్ 3 నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.స్పెషల్‌ ఆఫీసర్ల పాలనను కొనసాగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్‌ 90ను కోర్టు కొట్టివేసింది.