ఓటర్ల తుది జాబితాను విడుదల చేయవద్దు

 

తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అవకతవకలపై ఉమ్మడి హైకోర్టులో పలు పిటిషన్లు విచారణ దశలో ఉండగానే తమ వద్ద అదే అంశాలపై దాఖలైన పిటిషన్లను తాము విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.ఓటర్ల జాబితా అభ్యంతరాలపై దాఖలైన మూడు పిటిషన్లను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. మూడు పిటిషన్లలో రెండింటిని హైకోర్టు తోసిపుచ్చింది.సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ అందడంతో శశిధర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

విచారణ పూర్తయ్యే వరకు తుది ఓటర్ల జాబితాను విడుదల చేయవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.మరో వైపు తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులతో సమావేశమైన కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా తయారీ, ఈవీఎంలు సిద్ధం వంటి కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం.తెలంగాణాలో ఎన్నికల నిర్వహణకు ఉన్న పరిస్థితులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ సీఈసీకి వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి రజత్‌కుమార్‌ నివేదిక సమర్పించారు.ఓటర్ల జాబితా విడుదల చేయవద్దని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దీనిపై కూడా ఈసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఈనెల 10న ఈసీ బృందం హైదరాబాద్‌ వచ్చే అవకాశముంది. అనంతరం ఎన్నికల నిర్వహణ తేదీ ప్రకటన ఉంటుందని అంతా భావిస్తున్నారు.