ఆర్టీసీ జేఏసీకి మరో షాక్.. రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!!

 

దాదాపుగా 50 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ఒక్క డిమాండ్ ని కూడా నెరవేర్చుకోలేక సతమవుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాలకు మరో షాక్ తగిలింది. రూట్ల ప్రైవేటీకరణపై దాఖలపైన రిట్ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈనిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు.. ఈరోజు తుది తీర్పు వెల్లడించింది. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. అడ్వొకేట్ జనరల్ వినిపించిన వాదనలతో కోర్టు ఏకీభవించింది.

ఆర్టీసీపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని ఏజీ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలసీ విధానాలలో పిటిషనర్ల జోక్యం తగదని సూచించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఏజీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా.. రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ అమలు చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర రవాణా అథారిటీకి అధికారం అప్పగిస్తున్నట్టు కేబినెట్ తీర్మానంలో ఉందని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం వేరు, అథారిటీ వేరని.. ప్రభుత్వం చేయాల్సిన పని అథారిటీ ఎలా చేస్తుందని కోర్టు ప్రశ్నించింది. దీంతో.. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ ప్రక్రియ నిర్వహిస్తారని ప్రభుత్వం తరఫున ఏజీ హామీ ఇచ్చారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి జీవో రాకముందే.. కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేయకూడదన్న ఏజీ వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అదేవిధంగా.. మోటారు వాహనచట్టం-1988 సెక్షన్ 102 ప్రకారం రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వానికి విస్తృత అధికారాలున్నాయని అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.